
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నెలకొల్పిన ఓ రికార్డుని న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ అధిగమించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా ధోనిని రాస్ టేలర్ వెనక్కినెట్టాడు. టీ20ల్లో ఇప్పటివరకు ధోనీ 267 సిక్స్‌లు బాదగా, తాజాగా రాస్ టేలర్ అధిగమించాడు.
ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతోన్న రాస్ టేలర్ జమైకా తలవాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా గురువారం జమైకా-సెయింట్ కిట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్ల సాయంతో 35 బంతుల్లో 51 పరుగులతో రాస్ టేలర్ చెలరేగాడు.

దీంతో జట్టు విజయంలో కూడా కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.
దీంతో 47 పరుగులతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు ముందు 267 సిక్స్‌లతో ధోని, రాస్ టేలర్ అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో సమానంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్స్‌లు బాదడం ద్వారా రాస్ టేలర్ ధోనిని అధిగమించాడు. ఈ జాబితాలో ధోని 13వ స్థానంలో ఉండగా రాస్ టేలర్ 12వ స్థానానికి ఎగబాకాడు.
248 మ్యాచ్‌ల్లో రాస్ టేలర్ 271 సిక్స్‌లు బాదగా... 297 మ్యాచ్‌ల్లో ధోని 267 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ 857 సిక్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుడంగా రోహిత్ శర్మ 313 సిక్స్‌లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.