ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన విషయం తెలిసిందే. గత గురువారం హార్దిక్ భార్య నటాషా స్టాన్కోవిచ్ పండంటి బాబుకు జన్మనిచ్చారు. హార్దిక్ తన కొడుకు ఫోటోను శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భార్య నటాషాతో పాటు ఉన్న ఫోటోను షేర్ చేశాడు. గులాబీ బోకేను బెడ్‌పై ఉంచి భార్యను ఆలింగనం చేసుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.
హార్దిక్ పాండ్యా ట్వీట్ చేస్తూ.. భార్యను పొగడ్తలతో ముంచెత్తుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'నా గులాబీకి గులాబీలు.. నేను ఎప్పటికీ గుర్తిండిపోయే ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన నీకు (నటాషా) ధన్యవాదాలు' అనే క్యాప్షన్ ఉంచాడు. పాండ్యా ట్వీట్‌కు నటాషా స్పందించి.. లవ్ యూ అని పేర్కొన్నారు. నటాషా బాబుకు జన్మనివ్వడంతో ప్రస్తుతం హార్దిక్ ఆనందంలో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుతం హార్దిక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాను తండ్రి అయిన విషయాన్ని హార్దిక్ పాండ్యా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 'దేవుడు మాకు కుమారుడిని ప్రసాదించాడు' అని హార్దిక్ తండ్రి అయిన విషయాన్ని వెల్లడించాడు. ఆపై శనివారం కుమారుడి ఫోటోను కూడా హార్దిక్ పోస్ట్ చేశాడు. తన కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. హార్దిక్, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని తెలియజేశారు.
View this post on InstagramRoses for my rose 🌹 Thank you for giving me the best gift ever 🙏🏾❤️
A post shared by Hardik Pandya (@hardikpandya93) on
గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్ పాండ్యా 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్లో 532, 50 ఓవర్ల ఫార్మాట్లో 957, పొట్టి క్రికెట్లో 310 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్నెస్ సాధించి రీఎంట్రీకి సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్ కారణంగా ఆ సిరీస్ రద్దు అయింది. లాక్డౌన్ కలిసి రావడంతో మరింత ఫిట్నెస్ సాధించాడు.
బ్యాట్స్‌మెన్‌ను బంతితో కొట్టిన బౌలర్.. 5 పరుగులు జరిమానా విధించిన అంపైర్ (వీడియో)