టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇద్దరూ కూడా అద్భుతమైన క్రికెటర్లు. కానీ కొందరు ఫ్యాన్స్ వీళ్లిద్దర్నీ పోల్చి చూపుతూ ఒకరు గొప్ప అంటే.. ఒకరు గొప్ప అని చెప్తుంటారు. అయితే వీళ్లిద్దరూ మాత్రం ఒకరిని ఒకరు చాలా గౌరవించుకుంటారు. కొంతకాలం క్రితం కోహ్లీ మాట్లాడుతూ రోహిత్ తనకు తెలిసిన బెస్ట్ ప్లేయర్ అని మెచ్చుకున్నాడు.
టీ20ల్లో సైతం కోహ్లీ అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు. అయినా సరే ఈ ఫార్మాట్‌లో రోహిత్ బెటర్ బ్యాటర్ అని చాలా మంది భావిస్తారు. రోహిత్ కూడా కోహ్లీ అద్భుతమైన బ్యాటర్ అని అంగీకరిస్తాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దర్నీ కంపేర్ చేస్తూ గొడవలు చేస్తూనే ఉంటారు. దీనిపై ఇటీవల స్పందించిన రోహిత్.. తామిద్దరి మధ్య అసలు పోలికే లేదన్నాడట.

'చాలా మంది అభిమానులు నన్ను కోహ్లీతో పోల్చడం చూశా. మా ఇద్దరి మధ్య అసలు పోలిక లేదు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ బెటర్ ప్లేయర్ అని నేను అంగీకరిస్తా' అని చెప్పాడట. ఈ విషయాన్ని ఒక ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో ఫార్మాట్లో వీళ్లిద్దరి రికార్డులు ఎలా ఉన్నాయో చూస్తే..
వన్డేల్లో..
కోహ్లీ, రోహిత్ ఇద్దరికీ అచ్చొచ్చిన ఫార్మాట్ వన్డేలు. రోహిత్ మూడుసార్లు ఈ ఫార్మాట్లో డబుల్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ ఈ ఫీట్ సాధించలేదన్న మాట నిజమే. అతని అత్యుత్తమ స్కోరు 183.
అయితే ఈ ఫార్మాట్‌లో సగటు చూసుకుంటే.. 265 మ్యాచుల్లో కోహ్లీ సగటు 57.32గా ఉంది. అదే రోహిత్ సగటు 48.69 మాత్రమే. ఇది కోహ్లీ కన్నా దాదాపు 10 తక్కువ. స్ట్రైక్ రేట్ చూసుకున్నా కూడా రోహిత్ (89.97) కన్నా కోహ్లీ (93.62) ఎక్కువ కావడం గమనార్హం.

పొట్టి ఫార్మాట్‌లో..
చాలా మంది టీ20్లల్లో కోహ్లీ కన్నా రోహిత్ బెటర్ అని భావిస్తారు. అయితే కోహ్లీ ఈ ఫార్మాట్లో కూడా అద్భుతంగా రాణించాడని మర్చిపోకూడదు. ఈ ఫార్మాట్లో కోహ్లీ సగటు 52.73 కాగా, రోహిత్ యావరేజ్ కేవలం 31.32 మాత్రమే. అదే స్ట్రైక్ రేటులో మాత్రం కోహ్లీ (137.96) కన్నా రోహిత్ (139.24) కొంచెం ఎక్కువ.
ఈ ఫార్మాట్లో కూడా ఎంతో నిలకడగా ఆడిన కోహ్లీ.. 2014, 2016 టీ20 వరల్డ్ కప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అందుకున్నాడు. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో కూడా భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి మర్చిపోకూడదు.

టెస్టుల్లో..
ఇక సుదీర్ఘ ఫార్మాట్‌లో వీళ్లిద్దరినీ కంపేర్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే కోహ్లీ ఇప్పటికే 108 టెస్టు మ్యాచులు ఆడాడు. అదే రోహిత్ వాటిలో సగం కూడా ఆడలేదు. తను ఇప్పటి వరకు కేవలం 49 టెస్టులే ఆడాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ కన్నా కోహ్లీ సుమారు 5 వేల పరుగులు ఎక్కువ చేశాడు. 50కి కొంచెం తక్కువ సగటుతో 29 సెంచరీలు కూడా నమోదు చేశాడు.