టీమిండియా తుదిజట్టుతోనే కాకుండా బెంచ్ బలంతోనూ ప్రత్యర్థిని ఓడించగలదని క్రికెట్ విశ్లేషకులు తరుచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఇది భారత క్రికెట్‌లో ఉండే పోటీ గురించి తెలియజేస్తుంది. భారత తుది జట్టులో చోటు సంపాదించాలంటే ఆటగాళ్ల మధ్య తీవ్రపోటీ తప్పదు. అదే కారణంతో వన్డే వరల్డ్ కప్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్ కూడా అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.
అయితే ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో చోటు సంపాదించిన శివమ్ దూబె అద్భుతంగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 9 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ అర్ధశతకంతో చెలరేగాడు. 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మూడు ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ దూబె నాటౌట్‌గా నిలవడం విశేషం.

దూబె 2019లోనే అరంగేట్రం చేసినా ఇప్పటివరకు 20 టీ20లే ఆడాడు. కరోనా లాక్‌డౌన్ తర్వాత అతడు టీమిండియా నుంచి పిలుపు కోసం మూడేళ్ల పాటు ఎదురుచూశాడు. మొత్తంగా వన్డే వరల్డ్ కప్ ముందు బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా దూబె జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు వరుస మెరుపు అర్ధశతకాలతో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నాడు.
అయితే హార్దిక్ పాండ్యకు పోటీగా శివమ్ దూబె నిలుస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ జట్టులో కొనసాగుతున్నాడు. గాయంతో అతడు దూరమైన సందర్భాల్లో పేస్ ఆల్‌రౌండర్ కొరత జట్టులో కనిపించేది. హార్దిక్‌లా పవర్ హిట్టర్, కొత్త బంతితో బౌలింగ్ చేసే ప్లేయర్ లేకపోవడంతో జట్టులో అతడి లోటు కనిపించేది. కానీ దూబె రాకతో పరిస్థితి మారిపోయింది.
ఈ నేపథ్యంలో నెటిజన్లు కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. హార్దిక్‌కు పోటీగానే శివమ్ దూబెకు రోహిత్ అవకాశాలు ఇస్తున్నాడని అంటున్నారు. అఫ్గాన్ రెండో టీ20లోనూ స్పెషలిస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్‌ను కాదని, దూబెతో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించాడని అంటున్నారు. అయితే 19 ఓవర్ వేసిన దూబె 20 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, రోహిత్ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దూబె గొప్ప ప్రదర్శనతో హార్దిక్‌ను ట్రోల్ చేస్తూ రోహిత్ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.