నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. పిచ్ దగ్గర ఇరు జట్ల కెప్టెన్లు, మ్యాచ్ రిఫరీ, వ్యాఖ్యాత రవిశాస్త్రి అందరూ రెడీగా ఉన్నప్పటికీ టాస్ ఆలస్యమైంది. కాయిన్ ఎక్కడ ఉందని అందరూ వెతుకుతూ గందరగోళానికి గురయ్యారు. అప్పుడే అసలు ట్విస్ట్ ఎదురైంది. అసలేం జరిగిదంటే..
గ్రూప్-ఏలో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సింది. అంతకంటే అరగంట ముందు టాస్ పడాల్సింది. కానీ వర్షం కారణంగా టాస్, మ్యాచ్ ఆలస్యమైంది. చిన్నపాటి జల్లులు కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఆ తర్వాత వరుణుడు వెళ్లిపోయినా మైదానం తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. మొత్తంగా గ్రౌండ్‌ను సిద్ధం చేయడంతో టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ అజామ్ పిచ్ దగ్గరగా వచ్చారు.

అయితే కాయిన్‌ను గాల్లోకి వేయమని రోహిత్‌కు వ్యాఖ్యాత రవిశాస్త్రి సూచించాడు. రోహిత్ కాయిన్ ఎక్కడ ఉందని మ్యాచ్ రిఫరీని అడిగాడు. మీ దగ్గరే ఉందని రిఫరీ బదులివ్వడంతో రోహిత్ తన పాకెట్ చెక్ చేసుకున్నాడు. జేబులో నుంచి కాయిన్ తీయడంతో బాబర్ అజామ్‌తో సహా అందరూ విరగబడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టాస్‌కు వచ్చే సమయాల్లో రోహిత్ మతిమరుపుతో ప్రవర్తించడం ఇదేం కొత్త కాదు.
డ్రెస్సింగ్ రూమ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని టాస్ గెలిచిన తర్వాత రోహిత్ ఎన్నో సందర్భాల్లో మరిచిపోయాడు. చాలా సేపు ఆలోచించి తిరిగి గుర్తుకు తెచ్చుకునేవాడు. కాగా, ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌కు మరోసారి అంతరాయం కలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ తొలి ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా ఎనిమిది పరుగులు చేసింది. షాహిన్ అఫ్రిది వేసిన ఆరు బంతుల్ని రోహిత్ ఎదుర్కొన్నాడు. మూడో బంతిని తన ట్రేడ్‌మార్క్ షాట్‌తో హిట్‌మ్యాన్ సిక్సర్‌గా మలిచాడు. అయితే రెండో ఓవర్ ఆరంభానికి ముందే వరుణుడు రీఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్లు తిరిగి డగౌట్‌కు వెళ్లారు.