టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కొత్త ప్రయాణంలో ధావన్‌కు అన్నీ కలిసి రావాలని దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు.
''శిఖర్ ధావన్.. నీ దూకుడును క్రికెట్ మైదానం మిస్ అవుతుంది. నీ చిరునవ్వు, స్టైల్, ఆట పట్ల నీకున్న అమిత ప్రేమ అందరినీ ఆకట్టుకుంటాయి. క్రికెట్ కెరీర్‌లో నీ లెగసీని అభిమానులు, సహచరుల గుండెల్లో నిలిచిపోతుంది. భవిష్యత్‌లో నీకు అన్ని కలిసిరావాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి'' - సచిన్ టెండూల్కర్

''నిర్భయమైన అరంగేట్రం నుంచి భారత క్రికెట్‌లో మోస్ట్ డిపెండబుల్ ఓపెనర్లలో ఒకరిగా ఎదిగావు. ఎన్నో జ్ఞాపకాలు అందించావు. ఆట పట్ల నీకున్న అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునువ్వును మిస్ అవుతాం. కానీ నీ లెగసీ కొనసాగుతూనే ఉంటుంది. మరవలేని గొప్ప ప్రదర్శనలు, జ్ఞాపకాలు అందించిన నీకు ధన్యవాదాలు. మైదానం వెలుపల మొదలవ్వనున్న సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ది బెస్ట్'' - విరాట్ కోహ్లి
''అద్భుతమైన కెరీర్ సాధించిన శిఖర్ ధావన్‌కు శుభాకాంక్షలు. ధావన్ అద్భుత క్రికెటరే కాకుండా వ్యక్తిగతంగా చాలా గొప్పవాడు. అన్ని పరిస్థితుల్లోనూ ఎంతో సానుకూలతతో ఉంటాడు. అతని తదుపరి ప్రయాణం గొప్పగా సాగాలని ఆశిస్తున్నా''- వీవీఎస్ లక్ష్మణ్
''శిఖర్‌కు అభినందనలు. మొహాలీలో నన్ను భర్తీ చేసినప్పటి నుంచి నువ్వు వెనుదిరిగి చూడలేదు. ఎన్నో ఏళ్లుగా అద్భుత ప్రదర్శనలు చేశావు. ఆనందమైన జీవితాన్ని నువ్వు కొనసాగించాలని కోరుకుంటున్నా''- వీరేంద్ర సెహ్వాగ్
''రూమ్‌లు నుంచి మైదానంలో జీవితకాలపు జ్ఞాపకాలు పంచుకున్నాం. ఓ ఎండ్‌లో ఉంటూ నువ్వెప్పుడూ నా పనిని సులభతరం చేశావు'' - రోహిత్ శర్మ