డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత భారత జట్టుకు నెలరోజుల గ్యాప్ దొరికింది. ఈ సమయంలో టీం అంతా విశ్రాంతి తీసుకుంటోంది. సహజంగానే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్‌తో భారత జట్టు మళ్లీ ఆడటం మొదలు పెడుతుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ అంత గొప్పగా రాణించలేదు. రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 15, 43 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లో కూడా రోహిత్ పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో జరిగే టెస్టులు లేదంటే ఆ జట్టుతో జరిగే మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో అతనికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

'ఐపీఎల్‌లో ఆ తర్వాత జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ శర్మ అంత జోష్‌గా కనిపించలేదు. అందుకే వెస్టిండీస్ టూర్‌లో కొంత భాగమైనా అతను విశ్రాంతి తీసుకోవాలని సెలెక్టర్లు అనుకుంటున్నారు. అతను అయితే టెస్టులు ఆడడు. లేదంటే ఆ తర్వాత జరిగే 8 వైట్ బాల్ గేమ్స్ ఆడడు. ఈ విషయంలో రోహిత్‌తో మాట్లాడిన తర్వాతే సెలెక్టర్లు ఒక నిర్ణయానికి వస్తారు' అని బీసీసీఐ ప్రతినిధులు చెప్పారు.
అయితే ఇంకా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడే భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రోహిత్‌తో మాట్లాడిన తర్వాత ఈ జట్లపై ఒక నిర్ణయానికి వస్తారని ఆ తర్వాత జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే రోహిత్‌తోపాటు కోహ్లీకి కూడా విశ్రాంతి ఇస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే అతను కూడా సీనియరే కదా. అయితే వైట్‌బాల్ ఫార్మాట్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అతన్ని పక్కన పెట్టరనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు.