INDvsSL : తొలి వన్డేకు అంతా సిద్ధం.. రోహిత్ ఫోకస్ దాని మీదనే..!

కొత్త ఏడాదిలో తొలి వన్డే ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. గువాహతి వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో శ్రీలంక, భారత్ తలపడనున్నాయి. ఈ ఏడాదిలో రెండు జట్లకూ ఇదే తొలి వన్డే కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు పోటీ ఉవ్విళ్లూరుతున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు సూపర్ స్టార్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరారు.

ఫామ్‌లో లేని లంక
వన్డేల్లో శ్రీలంక పెద్ద ఫామ్‌లో లేదు. తమ స్వదేశంలో చివరగాా ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన ఆ జట్టు వన్డే సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇంతకుముందు కూడా భారత్‌పై లంక రికార్డు పెద్ద బాగలేదు. 2017 నుంచి భారత్‌తో 13 వన్డేలు ఆడిన ఆ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. గతేడాదిలో స్వదేశంలో భారత్‌ను ఎదుర్కొన్న లంక.. కీలక బ్యాటర్లు లేకపోయినా సిరీస్ గెలవలేకపోయింది. అయితే భారత్‌లోనే వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ నుంచే జట్టును సిద్ధం చేయాలని లంకేయులు భావిస్తున్నారు.

టీమిండియా ఫోకస్ అదే
భారత్ కూడా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఫోకస్‌గానే ముందుకు వెళ్లనుంది. ఈ సిరీస్ తర్వాత వరల్డ్ కప్ కన్నా ముందు కేవలం 17 మ్యాచులే భారత్ ఆడుతుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఆడే జట్టును సెలెక్ట్ చేసుకునే ప్రయత్నాలను రోహిత్ శర్మ ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పెద్దగా ఆకట్టుకోని ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పక్కన పెట్టేసిన బీసీసీఐ.. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు జట్టులో చోటు కల్పించింది. అలాగే మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంకా వన్డేల్లో తన సత్తా చాటలేదు. ఇదే భారత్‌కు కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం.

గతేడాది ఫామ్ కొనసాగించాలని..
టీమిండియా గతేడాది 24 వన్డేలు ఆడింది. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. అలాగే టాప్ వికెట్ టేకర్‌గా మహమ్మద్ సిరాజ్ రికార్డు సృష్టించాడు. హార్దిక్ పాండ్యా కూడా జట్టుతో చేరడంతో బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. గతేడాది చివర్లో న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్ సిరీసులు మినహా మిగతా వన్డే సిరీసుల్లో భారత జట్టు బాగానే రాణించింది. అదే ఫామ్‌ను ఈ సిరీస్‌లో కూడా కొనసాగించి, కొత్త ఏడాదిని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది. అలాగే టీ20, వన్డే ఫార్మాట్లలో సెంచరీ కరువును తీర్చుకున్న కోహ్లీపైనే ఈ ఏడాది కూడా అందరి ఫోకస్ ఉండనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications