అయిదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా బోణీ కొట్టాలనుకున్న టీమిండియాకు పెద్దషాక్ తగిలింది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించి కూడా పరాజయాన్ని చవిచూడటంతో టీమిండియాపై విమర్శలు వస్తున్నాయి. భారత జట్టులోని లోపాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ జట్టు ఇదే జోరు కొనసాగిస్తే టెస్టు సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాడు. '' ఒలీ పోప్, టామ్ హర్ట్‌లీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సిరీస్‌ను వైట్ వాష్ చేయొచ్చు. 5-0తో సిరీస్ సాధించవచ్చు. ఉప్పల్ టెస్టు విజయం ఎంతో గొప్పది. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల వెనుకంజలో ఉండటంతో ఇంగ్లాండ్ ఓటమిపాలవుతుందని భావించారంతా''

''కానీ ఒలీ పోప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.ఇటీవల కాలంలో నేను చూసిన గొప్ప ఇన్నింగ్స్ ఇది. పోప్ ఆటకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బిత్తెరపోయాడు. స్వేచ్ఛగా ఆడకుండా ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ఒత్తిడి తీసుకురావాలి. విరాట్ కోహ్లి ఉండి ఉంటే ఇంగ్లాండ్ ఆటగాళ్ల దగ్గరకు వచ్చి.. 'మరోసారి ఇలాగే ఆడు. నువ్వు ఎంత మంచి ఆటగాడివో చూస్తా' అని అనేవాడు. అయితే ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు ఓటమికి భయపడదు''
''మరోవైపు రోహిత్ శర్మ ఇప్పుడు తన అసలైన కెప్టెన్సీని చూపిస్తాడు. నిర్భయంగా ఆడాలని ఆటగాళ్లకు సూచిస్తాడు. తొలి టెస్టులో ఓటమిపాలైనప్పటికీ తిరిగి సత్తాచాటగలమని అతడు చాటిచెప్పాలి. జట్టులో కోహ్లి లేకపోతే ప్రభావం ఉంటుంది. రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే టీమిండియా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్తుంది. ఇప్పుడు రోహిత్‌కు ఎంతో కీలకమైన సమయం. కోహ్లి లేకుండానే సిరీస్‌ను కాపాడుకోగలమని రోహిత్ నిరూపించుకోవాల్సి ఉంది'' అని పనేసర్ పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.