
హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ మళ్లీ జట్టులోకి ఎంపికవలేదు. ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయిన కారణంగా భారత సెలెక్టర్లు అతని మరో అవకాశం ఇవ్వలేదు. సౌతాంప్టాన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు మినహా పెద్దగా రాణించలేదు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే లాంటి యువకులు జట్టులోకి రావడంతో అతనిపై వేటు పడింది.
వన్డే కెరీర్‌లో 68 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 1289 పరుగులు మాత్రమే చేసాడు. వన్డే కెరీర్‌లో రెండు సెంచరీలు, 6 అర్థ సెంచరీలు సాధించాడు. ఇక 9 అంతర్జాతీయ టీ20ల్లో 20.33 సగటుతో 122 పరుగులు మాత్రమే చేసాడు. దీంతో జాదవ్‌ను కనీసం పరిశీలించడం లేదు భారత సెలక్టర్లు. ఇక చేసేదేంలేక దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. మనోడు అక్కడ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యట్లేదు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో జాదవ్ పూర్తిగా నిరాశపరిచాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మినహా.. ఆ టోర్నీ అంతా విఫలం అయ్యాడు.
తాజాగా ప్రాక్టీస్ సమయంలో తీసుకున్న ఓ ఫొటోను కేదార్ జాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఆ ఫొటోలో జాదవ్ కళ్లద్దాలు పెట్టుకుని స్టయిల్‌గా నిలబడ్డాడు. ఈ ఫోటోపై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాదవ్‌తో ఉన్న స్నేహంతో 'పోజులు ఇచ్చింది చాలు.. కొంచెం బ్యాటింగ్ కూడా చేయి' అని కామెంట్ చేశాడు. రోహిత్ ఇలా ట్వీట్ చేయడంతో అభిమానుల్లో నవ్వులు పూయించింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'రోహిత్.. నువ్వు చెప్పింది నిజమే' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'పోజులు ఇవ్వడమేనా.. పరుగులు చేసేది ఎమన్నా ఉందా' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. 'ఇక భారత జట్టుకు ఆడవా', 'పరుగులు చేసి పోజులు ఇవ్వు' అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. శుక్రవారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో తొలి టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ భాగ్యనగరంలోనే ఉన్నాడు.