
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఒక ఫన్నీ ఘటన జరిగింది. ఈ టెస్టు సిరీసులో ఆడే అవకాశం రాని యువ బ్యాటర్ ఇషాన్ కిషన్.. డ్రింక్స్ అందిస్తూ కనిపించాడు. అలా డ్రింక్స్ ఇవ్వడానికి మైదానంలోకి వచ్చిన కిషన్.. రోహిత్‌కు వాటర్ బాటిల్ ఇచ్చాడు. మంచినీళ్లు తాగిన రోహిత్ అతనికి బాటిల్ తిరిగి ఇచ్చేశాడు. అటుగా పరిగెత్తుకెళ్లబోయిన కిషన్.. ఆ బాటిల్ చటుక్కున అందుకొని పరుగు తీయబోయాడు.
ఈ క్రమంలో రోహిత్ చేతిలోని బాటిల్ కింద పడిపోయింది. దాన్ని తీసుకొని కిషన్ వెళ్లబోతుంటే.. అతన్ని వెనుక నుంచి రోహిత్ ఒకటి పీకబోయాడు. అది కిషన్ చూడలేదు కానీ.. కెమెరా చూసింది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రోహిత్ తన ఫన్నీ సైడ్ ఇలా మైదానంలో చూపించడం ఇదేం తొలిసారి కాదు. అదే విషయాన్ని గుర్తు చేస్తున్న అభిమానులు.. కిషన్‌ను ఒకటి పీకబోయిన వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ క్లిప్ వైరల్ అవుతోంది.
కాగా, అహ్మాదాబాద్‌లో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. మొదటి రోజు చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కామెరూన్ గ్రీన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట మొదలైన తర్వాత ఖవాజా, గ్రీన్ ఇద్దరూ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
బౌలర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో భారత బౌలింగ్ యూనిట్ చెమటోడుస్తోంది. అయినా కూడా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. బ్యాటర్లు చేసే తప్పిదాలను మాత్రమే క్యాష్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఖవాజా, గ్రీన్ ఇద్దరూ తొందర పడకుండా జాగ్రత్తగా ఆడుతుండటంతో బౌలర్ల పని మరింత కష్టంగా మారింది.