
హైదరాబాద్: టీమిండియా యువ క్రికెటర్ శార్ధూల్ ఠాకూర్ బుధవారం 28వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. అయితే, శార్ధూల్ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గతంలో చోటు చేసుకున్న జెర్సీ నెంబర్ 10 వివాదాన్ని మరోసారి గుర్తు చేశాడు.
రోహిత్ శర్మ తన ట్విట్టర్‌లో "పుట్టినరోజు శుభాకాంక్షలు బడ్డీ. ఈ జెర్సీ ధరించిన రెండో ఆటగాడివి. ఆ నెంబర్ ధరించాలంటే గట్స్ ఉండాలి. సాధ్యం కానిదంటూ ఏదీ లేదని చూపించడానికి నువ్వే ఉదాహరణ" అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శార్ధూల్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో జెర్సీ నెంబర్ 10ను ధరించాడు. అప్పట్లో శార్ధూల్ ఈ జెర్సీని ధరించడాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
సచిన్ గౌరవార్థం రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐని అభిమానులు కోరారు. దీంతో బీసీసీఐ జెర్సీ నెంబర్ 10కు రిటైర్మెంట్ ప్రకటించడంతో పాటు ఇకపై ఆ జెర్సీని ఎవరూ ధరించరని కూడా పేర్కొంది. అయితే, సచిన్ వీడ్కోలు పలికిన తర్వాత జెర్సీ నెంబర్ 10 ధరించిన మొదటి క్రికెటర్ శార్ధూలే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో బుధవారం శార్ధూల్ ఠాకూర్ 28వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో అతనికి శుభాకాంక్షలు చెప్పిన రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 10 వివాదాన్ని మరోసారి గుర్తుచేశాడు.