అఫ్గానిస్థాన్ సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన ఆఖరి టీ20లో అఫ్గాన్‌పై భారత్ రెండో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అఫ్గానిస్థాన్ బౌలర్లు షాకిచ్చారు. ఫరీద్ అహ్మద్ (3/20), అజ్మతుల్లా (1/33) ధాటికి 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
కానీ రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో), రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో) అద్భుత పోరాటంతో స్కోరును 212/4కు చేర్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు 212/6 స్కోరుతో నిలిచి మ్యాచ్‌ను 'టై' గా ముగించింది. గుర్బాజ్ (50; 32 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో), నైబ్ (55*; 23 బంతుల్లో), నబి (34; 16 బంతుల్లో) పోరాడారు. అనంతరం సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 16/1తో నిలిచింది. అయితే సూపర్ ఓవర్ ఛేజింగ్‌లో భారత్ కూడా 16 పరుగులే చేయడంతో ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది.

ఈ సారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫరీద్ బౌలింగ్‌లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. అనంతరం రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌తో రెండో సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలి బంతికే నబి ఔటవ్వగా, రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది.మూడో బంతికి గుర్బాజ్ ఔటయ్యాడు. కాగా, మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ ఒత్తిడిలో గొప్పగా ఆడారని కొనియాడాడు.
''మ్యాచ్ అద్భుతంగా సాగింది. గొప్పగా బ్యాటింగ్ చేశారు. మా తరపున రోహిత్, రింకూ అదరగొడితే.. వారి తరపున కొందరు హిట్టర్లు సత్తాచాటారు. అయితే రెండో సూపర్ ఓవర్‌లో రవి బిష్ణోయ్ ఆ రెండు బంతుల్ని సమర్థవంతంగా సంధించాడు. అదే మాకు విజయాన్ని తెచ్చిపెట్టింది. యువకులతో ఉన్న మా బౌలింగ్ విభాగానికి ఈ మ్యాచ్ మంచి అనుభవాన్ని ఇస్తుంది. రోహిత్ ఇవాళ అద్భుతంగా ఆడాడు. అతడు ఎంతటి క్లాస్ ప్లేయరో ఈ రోజు మరోసారి నిరూపించాడు. ఇక్కడ భారీ స్కోరు కావాలి. రోహిత్ ఆఖరి వరకు ఉండి తన రేంజ్‌ను చూపించాడు''
''రోహిత్ శర్మ తిరిగి టీ20 జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. అతడు, విరాట్ కోహ్లి ఉంటే జట్టుకు మరింత ప్రయోజనంగా ఉంటుంది. రింకూ సింగ్ అదరగొట్టాడు. గత కొన్ని నెలల నుంచి అతడు సత్తాచాటుతున్నాడు. ప్రశాంతతో ఉంటూ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. ఫినిషర్‌గానే కాకుండా భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. తన బలాలేంటి, నైపుణ్యాలేంటి, ఏ విషయాలను నేర్చుకోవాలనే విషయంలో అతడికి స్పష్టత ఉంది'' అని ద్రవిడ్ అన్నాడు.
తొలి సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతి ముందు రోహిత్ శర్మ రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగడంపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అది రవిచంద్రన్ అశ్విన్ వంటి మేధావి ఆలోచన అని ద్రవిడ్ సరదాగా పేర్కొన్నాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా, రూల్స్‌కు అనుగుణంగా అశ్విన్ తెలివిగా నడుచుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే.అయితే కావాలని మైదానాన్ని వీడిన రోహిత్ నిర్ణయంపై అఫ్గానిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.