పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వాస్తవానికి మొదటి టెస్టు కంటే రెండో టెస్టులోనే భారత్ మరింత బలంగా బరిలోకి దిగింది.
సారథి రోహిత్ శర్మ జట్టులోకి తిరిగొచ్చాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా అతను జట్టుకు కొండంత బలం. యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తిరిగి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతంగా కనిపించింది. కానీ పింక్ బాల్ టెస్టులో ఊహించని పరాభవం ఎదురైంది. పేలవమైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా ముందు టీమిండియా పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది.

అయితే ఓటమి అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో దూకుడుగా కనిపించిన భారత జట్టు.. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో ఆత్మరక్షణతో ఆడిందని విమర్శలు వస్తున్నాయి. పెర్త్ టెస్టులో బుమ్రా అద్భుత ప్రదర్శనతో నాయకుడిగా సహచరుల్లో స్ఫూర్తి రగిలించాడని, కానీ రెండో టెస్టులో రోహిత్ కనీసం నామమాత్రపు ప్రదర్శన కూడా చేయలేక జట్టుకు భారంగా మారాడని విమర్శిస్తున్నారు.
న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ ఓటమి రోహిత్‌ను తీవ్ర ప్రభావితం చేసింది. కెప్టెన్-బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత హిట్‌మ్యాన్ కాస్త విరామం తీసుకున్నాడు. రెండోసారి తండ్రైన నేపథ్యంలో కుటుంబంతో సమయాన్ని గడిపాడు. కొత్త ఉత్సాహంతో ఆస్ట్రేలియాకు వచ్చాడు. పది రోజులకు పైగా నిరంతర ప్రాక్టీస్ చేసి పింక్ బాల్ టెస్టు ఆడాడు. కేఎల్ రాహుల్ కోసం ఓపెనర్ స్థానాన్ని వదులుకుని, జట్టు కోసం నిస్వార్థంగా మిడిలార్డర్‌కు వెళ్లాడు.
కానీ ఆరో స్థానంలో వచ్చిన రోహిత్ తేలిపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి 9 పరుగులే చేశాడు. అయితే ఓటమి అనంతరం రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరుతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన 15 నిమిషాల అనంతరం రోహిత్ ఒంటరిగా డగౌట్‌లో దిగులుగా కూర్చున్నాడు. ప్రెజంటేషన్‌కు ముందు దాదాపు పది నిమిషాల పాటు గాల్లోకి చూస్తూ సుదీర్ఘంగా ఆలోచించాడు. బాధతో రోహిత్ భుజాలు కుంగిపోయినట్లుగా కనిపించింది.
ఘోరపరాజయాలు చవిచూసిన సందర్భాల్లో కూడా రోహిత్ ఇంత ఆందోళనగా కనిపించలేదు. ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నాడని, మూడో టెస్టు నుంచి బుమ్రాకు సారథి బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించనున్నారని కథనాలు మొదలయ్యాయి. 2014లో ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లి భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇదే తరహాలో రోహిత్ నుంచి బుమ్రా సారథి బాధ్యతలు అందుకుంటాడనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.