ఐపీఎల్‌లో 16వ సీజన్‌లో తమ జర్నీని విజయంతో మొదలు పెట్టాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. అందుకే జట్టు మొత్తం గట్టిగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుతో కలిసి తమ ఓపెనింగ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ తనదైన స్టైల్‌లో షాట్లు ఆడాడు. ఈ క్రమంలో లాఫ్టెడ్ షాట్‌తో అతను సిక్సర్ బాదిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు అందరూ కూడా వింటేజ్ రోహిత్ కనిపిస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. గతేడాది ఐపీఎల్‌లో రోహిత్ చాలా ఘోరంగా విఫలమయ్యాడు. మొత్తం 14 మ్యాచుల్లో కేవలం 19.14 సగటుతో 268 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని వైఫల్యం జట్టుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది. ఈ సీజన్‌లో ఆ జట్టు వరుసగా 8 ఓటములతో చెత్త రికార్డు కూడా సృష్టించింది.

గతేడాది ఆడిన మ్యాచులు అన్నింటిలో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన ముంబై జట్టు.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిస్థితిని ఈ ఏడాది ఎలాగైనా మార్చాలని ముంబై యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కామెరూన్ గ్రీన్, ఝై రిచర్డ్‌సన్ తదితరులను కూడా జట్టులోకి తీసుకుంది. వీరితోపాటు గాయంతో గతేడాది ఆటకు దూరమైన జోఫ్రా ఆర్చర్ కూడా జట్టుతో చేరడం ఆ టీం బలాన్ని మరింత పెంచుతోంది.
ఇప్పటి వరకు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ముంబై.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ జట్టుగా నిలిచింది. కానీ గతేడాది చాలా ఛండాలంగా ఆడింది. ఈసారి ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చి, అవసరమైతే మరో టైటిల్ నెగ్గాలని ముంబై భావిస్తోంది. ఇటీవలి కాలంలో రోహిత్ కూడా ఫామ్ అందుకోవడం, ఇప్పటికే పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో ఆ జట్టుకు అవకాశాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి.