
మాంచెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వివాదాస్పదంగా అవుట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ సైతం దీనిపై వివాదాస్పద నిర్ణయాన్నే తీసుకున్నారు. విండీస్ బౌలర్ కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతిని డిఫెన్స్ ఆడబోగా.. అది కాస్తా గతి తప్పింది. ఆ బంతి వెంట్రుకవాసిలో టర్న్ తీసుకుని రోహిత్ శర్మ ప్యాడ్స్, బ్యాట్‌కు మధ్య నుంచి వెళ్లి కీపర్ చేతిలో పడింది.
దీనిపై వికెట్ కీపర్ షై హోప్, కీమర్ రోచ్ గట్టిగా అప్పీల్ చేశారు. ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ కాదని ప్రకటించగా.. విండీస్ టీమ్ డీఆర్ఎస్ తీసుకుంది. రివ్యూకు వెళ్లింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందిగా కోరింది. చాలాసేపు బంతి గతిని పరిశీలించిన తరువాత థర్డ్ అంపైర్ మైకెల్ గాఫ్ అవుట్ అయినట్టు ప్రకటించాడు. స్నికో మీటర్‌లో బంతి తీసుకున్న అల్ట్రా ఎడ్జ్‌ను అవుట్‌గా భావించాడు.
అంపైర్ తీసుకున్న నిర్ణయంతో రోహిత్ శర్మ పెవిలియన్ దారి పట్టాడు. అక్కడికెళ్లిన తరువాత ఖాళీగా కూర్చోలేదు. ఈ అవుట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సేకరించాడు. తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. తాను అవుట్ కాదని, బంతి బ్యాట్‌కు-ప్యాడ్‌కు మధ్య నుంచి వెళ్లిందని వివరించాడు. బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్య బంతి రెండు మిల్లీమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయిందని వివరించాడు. తాను అవుట్ కాదన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోందని చెప్పుకొచ్చాడు.