భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీలను వన్డే ఫార్మట్ నుంచి కూడా తప్పించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. 2027 వరల్డ్ కప్ వరకూ ఆడాలనుకుంటోన్న వారిద్దరి ఆశలపై నీళ్లు చల్లడం దాదాపుగా ఖాయమైంది. పొమ్మనలేక పొగబెట్టిందనే వాదనలు వినిపిస్తోన్నాయి.
దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే బ్రాంకో టెస్ట్ ను ఇంట్రడ్యూస్ చేసింది బీసీసీఐ. ఫిజికల్ చాలా క్లిష్టమైన టెస్ట్ ఇది. ఫాస్ట్ బౌలర్లలో ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ టెస్ట్ ను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లలో ఫిట్‌నెస్ స్థాయిని పెంచడం, మరీ ముఖ్యంగా ఏరోబిక్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

దీన్ని అడ్డుగా పెట్టుకుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వన్డే ఫార్మట్ నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మ వయస్సు 40 సంవత్సరాలు దాటేస్తాయి. 40 ఏళ్లు దాటిన ఓ ప్లేయర్ బ్రాంకో టెస్ట్ లో పాస్ కావడం అసాధ్యమనే అభిప్రాయాలు ఉన్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇదే అంశంపై మాట్లాడారు. రోహిత్ శర్మను 2027 ప్రపంచకప్‌కు ముందే రిటైర్ చేయించడానికే బీసీసీఐ ఈ బ్రాంకో టెస్ట్ ను ప్రవేశపెట్టిందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఫిట్‌గా లేడని చాలా మందికి తెలుసునని, అయినప్పటికీ అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా బెంచ్ కే పరిమితం చేయడం బీసీసీఐ సాధ్యపడట్లేదని చెప్పాడు.
ఈ పరిణామాల మధ్య రోహిత్ శర్మకు బీసీసీఐ నుంచి పిలుపు అందింది. బ్రాంకో టెస్ట్ కు అటెండ్ కావాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 13వ తేదీన రోహిత్ శర్మ బ్రాంకో టెస్ట్ కు హాజరు కానున్నాడు. బెంగళూరులో బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఫిట్ నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు.
ఈ టెస్ట్ పైనే రోహిత్ శర్మ భవిష్యత్ ఆధారపడి ఉందనడంలో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఇందులో అతను వందశాతం ఫిట్ నెస్ ను నిరూపించుకుంటేనే నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడగలడు. లేకపోతే- అతని కేరీర్ కు బీసీసీఐ బలవంతంగా తెరదించినట్టవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
రోహిత్ శర్మ యో-యో టెస్ట్‌తో పాటు, కొత్తగా ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్‌కు కూడా హాజరుకావాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో మార్చి 9న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. చివరిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.