
తొలి బ్యాట్స్‌మెన్..
ఏ క్రికెటర్‌కైనా ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడటం ఓ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక్క మ్యాచ్ ఆడినా చాలు.. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్లలో ఆ ఆటగాడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతోంది. అలాంటిది- ఏకంగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తే! చరిత్రలో తన కంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నట్టవుతుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ విషయంలో జరిగింది అదే. ఒక ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అయిదు సెంచరీలు చేయడం మహామహులు, హేమాహేమీల వల్లే కాలేదు. అలాంటిది రోహిత్ శర్మ అలవోకగా సాధించి అవతల పడేశాడు. ఓ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అయిదు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఆవిర్భవించాడు.

ట్రెండ్ సెట్టర్‌గా..
నిజానికి- ప్రపంచకప్ టోర్నమెంట్లలో అయిదు సెంచరీలను బాదిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఒకే టోర్నమెంట్‌లో ఈ ఘనత సాధించిన క్రికెటర్ మరొకరు లేరు. 2015 ప్రపంచకప్‌లో శ్రీలంక క్లాసికల్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కార నాలుగు సెంచరీలు సాధించాడు. దీన్ని అధిగమించేశాడు రోహిత్ శర్మ. తనకంటూ ఓ ట్రెండ్‌ను సెట్ చేశాడు. మొత్తం ప్రపంచకప్ టోర్నమెంట్లలో రోహిత్ శర్మ ఆరు సెంచరీలను నమోదు చేసినట్టయింది. ఇప్పటిదాకా ఈ రికార్డు సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉండేది. 16 ఇన్నింగుల్లో రోహిత్ శర్మ ఆరు సెంచరీలను చేశాడు. ఇదివరకు సచిన్ 44 ఇన్నింగుల్లో ఆరు సెంచరీలు చేశాడు. అతనితో పాటు రికీపాంటింగ్ 42 ఇన్నింగుల్లో అయిదు, కుమార సంగక్కార 35 ఇన్నింగుల్లో అయిదు సెంచరీలను ఊదేశారు.

లీగ్ దశలోనే అత్యధిక స్కోరు
ప్రస్తుతం ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులను సాధించిన రికార్డు కూడా రోహిత్ శర్మ ఖాతాలో పడిపోయింది. ప్రస్తుతం 647 పరుగులతో టాప్‌లో ఉన్నాడీ రైట్ హ్యాండ్ డాషింగ్ ఓపెనర్. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే- లీగ్ దశల్లోనే ఇంత భారీ ఎత్తున పరుగులను పిండుకోవడం. సెమీఫైనల్, ఫైనల్ మ్యచ్‌లను వదిలేస్తే.. లీగ్ దశలోనే ఇన్ని పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ మరొకరు లేనే లేరు. ఇదివరకు ఈ రికార్డు కూడా సచిన్ పేరు మీదే ఉండేది. 2003 ప్రపంచకప్ మొత్తానికీ సచిన్ 673 పరుగులు చేశాడు. దాన్ని తుడిచి పడేశాడు. లీగ్ దశలోనే 647 పరుగులు చేసిన ఘనత సాధించాడు. ఫైనల్ పరిస్థితి ఎలా ఉన్నా.. సెమీ ఫైనల్‌లో ఆడబోతున్నందున రోహిత్ శర్మ ఈ దూకుడును ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాడు సగటు క్రికెట్ ప్రేమికుడు.

సెమీస్‌లో ఇదే జోరు..
మంగళవారం టీమిండియా తొలి సెమీ ఫైనల్ ఆడబోతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కాబోతోంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిల్చున్న న్యూజిలాండ్ టీమ్‌ను ఎదుర్కొనబోతోంది టీమిండియా. రన్ రేట్ ఆధారంగా సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టిన బ్లాక్ క్యాప్స్.. టీమిండియా జోరును ఏ స్థాయిలో అడ్డుకుంటుందనేది ఆసక్తికర అంశం. టోర్నమెంట్ ఆరంభంలో వరుసగా గెలుస్తూ వచ్చిన న్యూజిలాండ్.. చివరికొచ్చేసరికి చేతులెత్తేసింది. వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయాన్ని చవి చూసింది. ఆరంభంలో సాధించిన విజయాలు కివీస్‌కు కొండంత అండగా నిలిచాయి. సెమీస్‌కు దారి చూపాయి.


Click it and Unblock the Notifications












