
పరాజయాలతో టోర్నీని మొదలు పెట్టి:
ఇన్‌స్టాగ్రామ్‌లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్లలో భారత్ ఆటతీరు ఎలా ఉండాలని అడగ్గా.. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ లాగా ఉండాలని సూచించాడు. 'ఐపీఎల్ టోర్నీలో ముంబై ఆటతీరు విభిన్నంగా ఉంటుంది. తొలుత పరాజయాలతో టోర్నీని మొదలు పెట్టి.. ఆ తర్వాత విజయాల బాట పడుతుంది. చివరికి విజేతగా నిలుస్తోంది. భారత్ కూడా ఐసీసీ ఈవెంట్లలో ఇలానే ఆడాలి' అని రోహిత్ సూచించాడు.

అలా ఆడితే విజేతగా నిలవొచ్చు:
'ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ వరకు అజేయంగా నిలుస్తున్నాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో ఓడిపోయాం. ఆ టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించాం, కానీ ఫైనల్లో ఓడాం. ఇక గత సంవత్సరం 2019 ప్రపంచ కప్‌లో కూడా విజయాలు సాధించాం. కీలక సెమీ-ఫైనల్‌లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో ఓడాం. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఆడినట్టు ఆడితే విజేతగా నిలవొచ్చు' అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో కొన్ని ఓడిపోయి టోర్నమెంట్ ముగిసే వరకు అన్ని మ్యాచ్‌లను గెలవాలని రోహిత్ అంటున్నాడు.

నాకౌట్‌లో తేలిపోతోన్న భారత్
టీమిండియా గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతోంది. ప్రస్తుతం టెస్టుల్లో నెం.1, వన్డేల్లో రెండు, టీ20ల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం తన మార్క్ చూపెట్టట్లేదు. ఆరంభంలో అజేయ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. నాకౌట్‌లో మాత్రం తేలిపోతోంది. 2017 చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2019 వన్డే ప్రపంచకప్ కీలక దశలో టీమిండియా వెనుదిరిగింది. 2011 ప్రపంచకప్ మినహా ఇప్పటివరకు ఒక్క మంచి ఫైనల్ ప్రదర్శన లేదు.

మూడేళ్లలో 217 సిక్సర్లు:
ఇప్పటివరకు 364 అంతర్జాతీయ మ్యాచ్‌లు (అన్ని ఫార్మట్లు కలిపి) ఆడిన రోహిత్ శర్మ.. 14,029 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా 423 సిక్సర్లతో టాప్-3లో ఉన్నాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో క్రిస్ గేల్ (534), షాహిద్ ఆఫ్రిది (476)లు ఉన్నారు. 2019 ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో మెస్మరైజ్ చేసిన రోహిత్.. గడిచిన ఈ మూడేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 217 సిక్సర్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.


Click it and Unblock the Notifications












