
ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిన భారత జట్టుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో తమ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఓపెనర్లే కొట్టేశారు. హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచిన మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్.. ఆసీస్‌ను కేవలం 11 ఓవర్లలోనే విజయ తీరాలకు చేర్చారు. దీనిపై స్పందించిన రోహిత్ శర్మ.. ఇది చాలా డిసప్పాయింటింగ్ ఓటమి అని అభిప్రాయపడ్డాడు.
తమ బ్యాటర్లు సరిగా ఆడలేదని, వాళ్లు విఫలం అవడంతోనే మ్యాచ్ ఓడిపోయామని అన్నాడు. బోర్డుపై సరిపోయినంత టార్గెట్ సెట్ చేయలేకపోయామని, ఈ కారణంగానే ఇలా ఓటమి పాలయ్యామని చెప్పాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఎక్కడా జట్టు కోలుకోలేకపోయిందన్నాడు. 'మేం సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాం. బోర్డుపై సరిపోయినంత స్కోరు లేదని తెలుసు. ఈ పిచ్‌పై 117 పరుగులు చిన్న స్కోరు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. దీంతో కావలసినన్ని పరుగులు చేయలేకపోయాం. అలా జరగకపోయి ఉంటే మ్యాచ్ వేరేగా ఉండేది' అని రోహిత్ అన్నాడు.
శుభ్‌మన్ గిల్ త్వరగా అవుటైన తర్వాత తను, విరాట్ కలిసి వేగంగా 30 పరుగులు జోడించిన విషయాన్ని రోహిత్ గుర్తుచేశాడు. కానీ తను అవుటైన తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు పోవడం జట్టును బాగా దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ చాలా క్వాలిటీ బౌలర్ అని చెప్పాడు. 'అతను కొత్త బంతితో ఇలా చాలా ఏళ్లుగా రాణిస్తున్నాడు. తన బలానికి సరిపోయేలా బౌలింగ్ చేశాడు. దానికి తగ్గట్లే మేం ఆడాల్సింది. బంతి లోపలి వైపు వస్తుందా? లేక దూరంగా వెళ్తుందా? అని మేం ప్రతి బంతికీ గెస్ చేయాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చాడు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే బుధవారం నాడు చెన్నై వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది.