
విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారనేది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగిస్తారనే వాదననే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దీనిపై కాస్త స్పందించాడు. టెస్టు కెప్టెన్సీకి ఇంకా సమయం ఉందని, ప్రస్తుతం దాని గురించి మరిచిపోడంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రస్తుతం తన ఫోకస్ అంతా పరిమిత ఓవర్ల ఫార్మాట్ పైనే ఉందని తెలిపాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమన్న రోహిత్ ప్రస్తుతం తన దృష్టి అంతా వెస్టిండీస్, శ్రీలంకతో జరగనున్న సిరీస్‌లపైనే ఉందని చెప్పుకొచ్చాడు.
అలాగే టాప్ 3లో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే అంశంపై రోహిత్ సరదాగా స్పందించాడు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లను ఓపెనర్లుగా పంపి.. శిఖర్ ధావన్‌ను తనను బెంచ్‌లో ఉంచాలనుకుంటున్నారా? అంటూ నవ్వుతూ అన్నాడు. హిట్‌మ్యాన్ ఇచ్చిన ఈ సరదా సమాధానంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కాసేపు నవ్వులు అలుముకున్నాయి. కాగా శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ కరోనాతో ఐసోలేషన్‌లో ఉండడంతో రోహిత్‌తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారనే అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. తొలి వన్డేలో తనతో కలిసి యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
కాగా నేటి నుంచి అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నేడు మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభం కానున్న తొలి వన్డే మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకంటే భారత్‌కు ఇది 1000వ వన్డే మ్యాచ్ కానుంది. తద్వారా వన్డే క్రికెట్‌లో 1000 వన్డే మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది.
తుది జట్లు(అంచనా)
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్, దీపక్ హుడా, దీపక్ చాహర్, శార్దూల్, కుల్దీప్ యాదవ్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ.
వెస్టిండీస్:
షాయ్ హోప్, బ్రండన్ కింగ్, పూరన్, షమారా బ్రూక్స్, బ్రావో, పొలార్డ్ (కెప్టెన్), స్మిత్, హోల్డర్, అకిల హుసేన్, రోచ్, హేడెన్ వాల్ష్.