కాన్బెర్రా: వన్డే ప్రపంచ కప్ పోటీల్లో జింబాబ్వేపై తాను డబుల్ సెంచరీ చేసిన విషయంపై వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ స్పందించాడు. వన్డేల్లో రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు చేసినప్పటి నుంచి తాను డబుల్ సెంచరీ చేయాలని అనుకుంటూ వస్తున్నట్లు అతను తెలిపాడు. 35 ఏళ్ల క్రిస్ గేల్ మంగళవారం జింబాబ్వేపై జరిగిన మ్యాచులో 16 సిక్సులు, పది ఫోర్లతో 215 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
తొలి డబుల్ సెంచరీ సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని క్రిస్ గేల్ అన్నాడు. రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు చేసినప్పటి నుంచి తాను ఒక్కటైనా చేయలేకపోయాననే గాయం సలుపుతోందని ఆయన అన్నాడు. తన విధ్వంసక బ్యాటింగ్ తర్వాత ఆయన మాట్లాడాడు.

ఇప్పటి వరకు రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. వన్డేల్లో 264 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడు కూడా అతనే. 2014లో శ్రీలంకపై అతను ఈ స్కోరు సాధించాడు. బాగా ఆడాల్సిన తీవ్రమైన ఒత్తిడిలో తాను ఉన్నానని, తాను డబుల్ సెంచరీ చేశాననే విషయం తెలియగానే ఆశ్చర్యం వేసిందని గేల్ అన్నాడు.
డబుల్ సెంచరీ సాధించగలిగినందుకు దైవానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, పరుగులు చేయాల్సిన తీవ్రమైన ఒత్తిడికి తాను గురవుతున్నానని, తనకు ఫోన్‌లోనూ ట్విట్టర్‌లోనూ విపరీతంగా మెసేజ్‌లు వస్తున్నాయని, దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని, ఇంతటి ఒత్తిడికి తాను ఇదివరకు ఎప్పుడూ గురి కాలేదని, చివరకు వారికి సమాధానం ఇవ్వడానికి అవకాశం దక్కిందని గేల్ అన్నాడు.
ఔట్ కాకుకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించాలనే ఉద్దేశంతో ఆడుతూ వచ్చానని, ప్రారంభంలో కాస్తా మందకొడిగా ఆడానని, ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచాలని ప్రయత్నించానని, కొంత సేపటి తర్వాత బౌలర్లను లక్ష్యం చేసుకుని ఆడగలిగానని అన్నాడు. చాలా మందికి తన విషయంలో తెలియని విషయాలున్నాయని, చాలా గాయాలు అయ్యాయని, వయస్సు కూడా మీద పడుతూ వస్తోందని గేల్ అన్నాడు. మొత్తంగా తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నాడు.