న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం అనంతరం టీమిండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురికావడం ఇదే తొలిసారి.
అంతేగాక ఈ ఏడాది స్వదేశంలో టెస్టు ఫార్మాట్‌లో భారత్‌కు ఇది నాలుగో ఓటమి. 1969 తర్వాత సొంతగడ్డపై ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే ప్రథమం. మరోవైపు ఈ ఘోర ఓటములు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆస్ట్రేలియాతో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్‌ను కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం 4-0తో గెలిస్తేనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టైటిల్ పోరుకు టీమిండియా చేరగలదు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమికి సరైన ప్రాక్టీస్ లేకపోవడం ఓ కారణం. దీంతో ఆటగాళ్లు ఎక్కువగా సాధన చేసేలా జట్టు యాజమాన్యం చూస్తోంది. ఈ క్రమంలో ఇండియా-ఏ జట్టుతో టీమిండియా తలపడే వార్మప్ మ్యాచ్‌ను రద్దు చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ కంటే మ్యాచ్ సిమ్యులేషన్‌తో ఎక్కువ సాధన చేయవచ్చని ఈ నిర్ణయం తీసుకుంది.
''మేం దాదాపు 19 మంది ప్లేయర్లతో ఆస్ట్రేలియాకు వెళ్తున్నాం. మాకు ప్రాక్టీస్ మ్యాచ్‌కు మూడు రోజులే ఉంది. ఆ మూడు రోజుల్లో ప్రతిఒక్కరు సాధనే చేయడానికి ఎంత పనిభారం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ బ్యాటర్లు, బౌలర్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసేలా మ్యాచ్ సిమ్యులేషన్ చేయాలని భావిస్తోంది. వార్మప్ మ్యాచ్ కంటే ఇదే ఉత్తమని నిర్ణయించుకున్నాం''
''మ్యాచ్‌లో ఓ బ్యాటర్ ఔట్ అయితే డగౌట్‌లో ఓ రోజంతా కూర్చోవాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కదు. కానీ మ్యాచ్ సిమ్యులేషన్‌లో ఓ ఆటగాడు 60-70 బంతులు ఆడవచ్చు. ఆ సదరు ప్లేయర్‌కు ఆ ప్రాక్టీస్ సరిపోతుందని భావిస్తే, అతనికి విశ్రాంతి ఇచ్చి మరో ఆటగాడికి అవకాశం ఇవ్వొచ్చు'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15 నుంచి ఇండియా-ఏతో టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా, నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభం కానుంది.