
హైదరాబాద్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో మరో రికార్డుకి చేరువయ్యాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనున్న సంగతి తెలసిందే.
ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ సిక్సర్ల రికార్డుని బద్దలు కొట్టేందుకు రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో యువరాజ్ సింగ్ ఇప్పటి వరకు 58 మ్యాచ్‌ల్లో 74 సిక్స్‌లు బాదాడు. అదే రోహిత్ శర్మ 69 మ్యాచ్‌ల ద్వారా 56 సిక్స్‌లు నమోదు చేశాడు.
ఇద్దరి మధ్య సిక్సుల్లో ఉన్న తేడా 18 మాత్రమే. ఇండోర్ వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న రెండో టీ20లో ఈ రికార్డుని రోహిత్ శర్మ అందుకోవాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఇటీవలే మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 153 బంతుల్లో 13 సిక్సుల సాయంతో 208 పరుగులు నమోదు చేశాడు. ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే యువీ సిక్సుల రికార్డుని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మూడు టీ20ల సిరిస్‌లో ఇంకా రెండు టీ20లు మిగిలున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో 18 సిక్సులు బాదడం రోహిత్ శర్మకు పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటివరకు 174 వన్డే మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 163 సిక్సులు బాదాడు. 23 టెస్టుల్లో 28 సిక్సులు బాదాడు.
లంకతో సిరిస్ ముగిసిన అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ మూడు టీ20ల్లోనైనా రోహిత్ శర్మ... యువరాజ్ సింగ్ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.