వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన భారత్.. వెంటనే టీ20 సిరీస్‌కు రెడీ అయింది. ఈ సిరీసులో సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. జట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ శర్మ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అతను ఇక ఈ ఫార్మాట్ ఆడటం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం మంచిదేనని కొందరు నిపుణుల మాట. ఎందుకంటే?
పనిభారం ఎక్కువ
వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీ20 సిరీస్ మొదలైంది. ఇది చూస్తేనే టీమిండియా ఎంత పనిభారం ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్.. తన వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంది. మరీ ఇంటెన్స్ వర్కవుట్ వల్ల గాయాలపాలు అయితే అది అతనికి, జట్టుకు ఏమాత్రం మంచిది కాదు.

అంతేకాదు, ఈ డిసెంబరు నుంచి వచ్చే మార్చ్ వరకు టీమిండియా ఏడు టెస్టులు కూడా ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అన్ని ఫార్మాట్లలో ఆడుతూ, దానికితోడు ఐపీఎల్ కూడా ఆడటం రోహిత్ వల్ల కాని పనే అని చెప్పాలి. ఎందుకంటే టెస్టు ఫార్మాట్‌పై ఇకపై రోహిత్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
కొత్త కుర్రాళ్లకు అవకాశం
రోహిత్ తర్వాత ప్రస్తుతం భారత్ వద్ద నలుగురు కుర్రాళ్లు ఓపెనింగ్ స్థానం కోసం పోటీలో ఉన్నారు. వారిలో గిల్ దాదాపుగా తన ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. మిగతా ఒక్క స్థానం కోసం ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ పోటీ పడుతున్నారు. వీళ్లందరూ కూడా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి సత్తా చాటుకున్న వాళ్లే. వీళ్లు కాక పృథ్వీ షా వంటి వాళ్లు కూడా ఉన్నారు.
ఈ కుర్రాళ్లంతా కొంత కాలంగా జట్టుతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఇక రోహిత్ రిటైర్‌మెంట్‌కు దగ్గర పడిన సమయంలో వీళ్లను సెలెక్టర్లు నమ్మాల్సి ఉంది. ఇలాంటి సమయంలో రోహిత్ ఈ ఫార్మాట్‌కు దూరం అవడం వల్ల వీళ్లకు తమ సత్తా నిరూపించుకునే అవకాశాలు మరిన్ని దక్కుతాయి.
టెస్టులపై ఫోకస్
ఇప్పటి వరకు రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీలు ఆడింది. కానీ ఒక్కటి కూడా గెలవలేదు. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లినా.. ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ క్రమంలో వచ్చే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ని గెలిచి, తన కెరీర్‌ను అత్యుత్తమంగా ముగించాలని రోహిత్ కోరుకుంటే తప్పుకాదు.
కాబట్టి రోహిత్ పక్కాగా రెడీ అయ్యి, 2025 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయాలంటే అతను టెస్టులపై గట్టిగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో పొట్టి ఫార్మాట్‌ను పక్కన పెట్టేయడమే చాలా మంచిది కదా.