
హైదరాబాద్: వన్డే క్రికెట్ కెరీర్‌తో పోలిస్తే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కెరీర్ చాలా భిన్నంగా ఉంటుంది. రోహిత్ శర్మ లేని వన్డే జట్టుని ఊహించలేం, కానీ రోహిత్ శర్మ లేని టెస్టు జట్టుని మాత్రం ఎన్నో సార్లు చూశాం. తాజాగా టెస్టు మ్యాచ్‌లకు తనని ఎంపిక చేయకుండా సెలక్టర్లు పక్కన పెట్టడంపై తానేమీ బాధ పడటం లేదని భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
ఈ ఏడాది మొదట్లో సపారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ విఫలం కావడంతో జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి జాతీయ సెలక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు. సోమవారం ముంబైలో జరిగిన సియెట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ దీనిపై స్పందించాడు.
'క్రికెటర్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇప్పటికే సగం కెరీర్ పూర్తి చేసేశాను. ఇప్పుడు కూడా నేను భారత జట్టులోకి ఎంపికవుతానా? తుది జట్టులో ఉంటానా? అని ఆలోచించడం భావ్యం కాదు. నేను ఆ స్థాయిని కూడా దాటేశాను. కెరీర్ తొలినాళ్లలో ఆ కంగారు ఉండేది' అని రోహిత్ శర్మ అన్నాడు.
'ఇప్పుడు నా దృష్టి అంతా ఆటని ఆస్వాదించడంపైనే ఉంది. ఒకవేళ సెలక్షన్ గురించి నేను ఎక్కువ ఆలోచించానంటే తప్పకుండా అది ఆటపై ప్రభావం చూపుతుంది. అలాకాకుండా ఆటని ఎంజాయ్ చేస్తూ.. నా వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా' అని చెప్పాడు.
'20 ఏళ్లప్పుడే భారత్ జట్టులో ఆడే అవకాశం దక్కింది. అరంగేట్రం చేసిన ఏడాదిలోనే టెస్టుల్లో కూడా ఛాన్స్ వచ్చింది. అయితే, గాయంతో ఆ అవకాశం చేజారింది. అప్పుడే నాకు అర్థమైంది. దేనికైనా టైమ్ రావాలి' అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
టీమిండియాలోకి 2010లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మకు 2013లో టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో అంచనాల్ని అందుకోలేకపోయిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు 25 టెస్టులు మాత్రమే ఆడాడు. ఇందులో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.