
గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌లో జట్టుతో కలుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా సారధ్యంలో టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు అదే హుషారుతో వన్డే సిరీస్‌లో అడుగు పెట్టనుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఫామ్‌పై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మాట్లాడిన మాజీ లెజెండ్ ఇర్ఫాన్ పఠాన్.. రోహిత్ కచ్చితంగా తన ఫామ్‌పై ఫోకస్ పెట్టాలని, అతని స్థాయి ప్రస్తుతం పడిపోయిందని చెప్పాడు.
రోహిత్ అద్భుతమైన ఆటగాడని చెప్పిన ఇర్ఫాన్.. 'ఇటీవలి కాలంలో రోహిత్ లెవెల్ కొంత పడిపోయిన మాట వాస్తవమే. అతని స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే అతను చాలా గొప్ప ప్లేయర్. గతంలో 2019 వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు సాధించిన విషయం మర్చిపోకూడదు. అంత గొప్ప ఆటగాడు ఇప్పుడు ఫామ్‌లో లేడు. ఆ వరల్డ్ కప్ సమయాన్ని గుర్తుచేసుకొని మళ్లీ ఫామ్ అందుకుంటే మంచిది' అని అన్నాడు. రోహిత్ కనుక ఫామ్ అందుకుంటే భారత జట్టు చాలా బలంగా మారుతుందని, వన్డే వరల్డ్ కప్ జరిగేది భారత్‌లోనే కాబట్టి అతని ఫామ్ జట్టుకు కూడా చాలా కీలకమని పఠాన్ చెప్పాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో బొటన వేలికి గాయం అవడంతో రోహిత్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగ్లా టెస్టు సిరీస్, శ్రీలంక టీ20 సిరీస్ రెండింటికీ అతను దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ వన్డే సిరీస్‌లో పునరాగమనం చేస్తున్నాడు. దీనిపై కూడా ఇర్ఫాన్ స్పందించాడు. 'ఇప్పుడు రోహిత్ రిఫ్రెష్ అయ్యి తిరిగొస్తాడు. మంచి ప్రిపరేషన్‌తోనే వస్తున్నాడని అనుకుంటున్నా. ఇక నుంచి తను రెగ్యులర్‌గా తన ఫిట్‌నెస్, ఫామ్‌పై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. తను ఇప్పటికే గొప్ప ప్లేయర్ అనడంలో సందేహం లేదు. గొప్ప కెప్టెన్ కూడా. కానీ ఫామ్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడితేనే అతనిపై కెప్టెన్సీ ఒత్తిడి తగ్గుతుంది' అని వివరించాడు.