
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా.. కోల్‌కతాలో కూడా అదే జోరు చూపించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు సాధారణంగా ఛేజింగ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అలాంటిది షనక ముందుగా బ్యాటింగ్ చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే పిచ్‌ను చూసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని షనక స్పష్టం చేశాడు.
తొలి వన్డే తర్వాత ఇక్కడ కూడా తాము ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నానని రోహిత్ అన్నాడు. అదే సమయంలో ఇక్కడ ఛేజింగ్ బాగుంటుందని అనిపించిందని, దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలా? అనే సందిగ్ధంలో పడిపోయానని రోహిత్ చెప్పాడు. ఇలాంటి సమయలో టాస్ ఓడితేనే బాగుంటుందంటూ జోక్ చేశాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ పొరపాట్లు సరిచేసుకుంటూ ముందుకు సాగడమే తమ ముందున్న లక్ష్యం అని స్పష్టం చేశాడు. తొలి వన్డేలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ యుజ్వేంద్ర చాహల్ గాయపడినట్లు తెలిపిన రోహిత్.. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడుతున్నట్లు చెప్పాడు.
భారత జట్టు చివరగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడినప్పుడు కుల్దీప్ ఇక్కడ హ్యాట్రిక్ తీసుకున్నాడు. దీంతో అతన్ని ఆడిస్తే మంచిదని నిపుణులు సూచించారు. రోహిత్ కూడా అదే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అలాగే శ్రీలంకలో కూడా రెండు మార్పులు చేసినట్లు షనక తెలిపాడు. ఫామ్‌లో ఉన్న పాథుమ్ నిస్సంకతోపాటు తొలి వన్డేలో భుజానికి గాయం అవడంతో మధుశంక కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో నువాందు ఫెర్నాండో, లాహిరు కుమార్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్.
శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ, చరిత్ ఆశలంక, నువానిదు ఫెర్నాండో, దాసున్ షనక (కెప్టెన్), వానిందు హసరంగ, దినుత్ వెల్లలెగె, చమిక కరుణరత్నే, కాసున్ రజిత్, లాహిరు కుమార.