ఇటీవలి కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో కూడా క్రికెట్ మేనియా పెరుగుతోంది. తాజాగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) సక్సెస్ చూస్తేనే ఇది అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే యూఎస్‌ఏలో కూడా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు అవుతున్నాయి. ఇదే వరుసలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన అకాడమీని అమెరికాలో ప్రారంభించాడు.
కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన క్రికింగ్‌డమ్ పేరుతో దీన్ని మొదలు పెట్టాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పాపులర్ ప్లేయర్లలో రోహిత్ శర్మ ఒకడని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ ఏ స్థాయి ప్లేయరో అందరికీ తెలిసిందే. వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్.

ఇప్పటికే భారత్‌లో క్రికింగ్‌డమ్ చాలా పాపులర్ అకాడమీ. దేశవ్యాప్తంగా దీనికి పలు బ్రాంచిలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ అకాడమీ విదేశాల్లో కూడా వ్యాపిస్తోంది. ఇప్పుడు అమెరికాలోని యంగ్ క్రికెటర్లకు ఈ అకాడమీ రెక్కలు తొడుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే వారి ఆశలు నెరవేరేందుకు అవసరమయ్యే నైపుణ్యాలను అందిస్తుంది.
ఇప్పటికే ఎంఎల్‌సీ తొలి సీజన్ గ్రాండ్ సక్సెస్ ద్వారా అగ్రరాజ్యంలో కూడా క్రికెట్ ప్రేమికులు ఉన్నారని స్పష్టంగా తెలిసిపోయింది. ఈ క్రమంలోనే ఇక్కడ రోహిత్ తన అకాడమీని మొదలు పెట్టాడు. ఐపీఎల్‌లో రోహిత్ కెప్టెన్సీలో ఉండే ముంబై ఇండియన్స ఫ్రాంచైజీలో భాగమైన ఎంఐ న్యూయార్క్.. ఇక్కడ జరిగిన ఎంఎల్‌సీ తొలి సీజన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
కాలిఫోర్నియాలో ఇలా రోహిత్ తన అకాడమీ ప్రారంభించిన విషయాన్ని హిట్‌మ్యాన్ బిజినెస్ పార్టనర్ చేతన్ సూర్యవంశీ వెల్లడించాడు. రోహిత్, ఇతర భాగస్వాములతో కలిసిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రోహిత్ శర్మకు చెందిన క్రికింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ.. ప్రీలాంచ్ సెలబ్రేషన్స్' అని ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది.