IND vs AUS: రోహిత్ హాఫ్ సెంచరీ.. మెరిసిన సూర్యకుమార్! ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!!

దుబాయ్: తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2021లో సన్నాహాన్ని ఘనంగా ఆరంభించిన టీమిండియా.. మరో ప్రాక్టీస్ మ్యాచులో కూడా అదరగొట్టింది. బుధవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ కోల్పోయి మరో 13 బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (60; 41 బంతుల్లో 5x4, 3x 6) హాఫ్ సెంచరీ చేశాడు. లోకేష్ రాహుల్ (39; 31 బంతుల్లో 2x4, 3x 6), సూర్యకుమార్ యాదవ్ (38; 27 బంతుల్లో 5x4, 1x 6) రాణించారు. ఆసీస్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తానికి మెగా టోర్నీకి ముందు జరిగిన రెండు సన్నాహక మ్యాచులలో భారత్ సత్తాచాటింది. ఇక ఈ నెల 24న భారత్ తన ప్రయాణాన్ని మొదలెట్టనుంది.

రోహిత్ అర్ధ సెంచరీ:
153 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. రాహుల్ ధాటిగా ఆడగా.. రోహిత్ అతడికి మద్దతుగా నిలిచాడు. ఇద్దరు చెలరేగడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 39 పరుగులు చేసిన రాహుల్‌ను స్పిన్నర్ ఆస్టన్ అగర్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత జోరు పెంచిన రోహిత్.. తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 పరుగులు చేశాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (38), హార్దిక్ పాండ్యా(14) మెరుపులతో భారత్‌కు సునాయాస విజయం దక్కింది.

అశ్విన్ మాయ:
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్షలను ఔట్ చేశాడు. రెండో ఓవర్ ఐదో బంతికి వార్నర్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్.. ఆ తర్వాతి బంతికి మార్ష్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. జడేజా వేసిన నాలుగో ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది.

స్మిత్ హాఫ్ సెంచరీ:
ఈ సమయంలో స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరు భారీ షాట్లు ఆడకున్నా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆసీస్ స్కోర్ బోర్డును ముందుకునడిపారు. ఐపీఎల్ 2021 నుంచి ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్.. భారత బౌలర్ల దాటికి సిక్సులు కొట్టలేకపోయాడు. ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన అనంతరం మ్యాక్సీ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ అండతో స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే 41 బంతులెదుర్కొన్న స్మిత్.. 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు స్టోయినిస్ బ్యాట్ జులిపించాడు. చివరి ఓవర్లో స్మిత్ ఔట్ అయ్యాడు. ఇనింగ్స్ చివరలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆసీస్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2.. రాహుల్ చహర్, భువనేశ్వర్, జడేజా తలా ఒక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications