అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నప్పటికీ, ఓవరాల్‌గా బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడింది. ఈ పరిస్థితిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
మహ్మద్ షమి కోసం భారత జట్టు తలుపులు తెరిచి ఉన్నాయని రోహిత్ అన్నాడు. చీలమండ గాయంతో మహహ్మద్ షమి గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023-ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత గాయానికి సర్జరీ చేసుకున్న ఈ కుడిచేతి వాటం పేసర్ దాదాపు సంవత్సరం ఆటకు దూరమయ్యాడు.

ఇటీవల రంజీ ట్రోఫీతో పోటీ క్రికెట్‌ను మొదలుపెట్టిన షమీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బరిలోకి దిగాడు. ఈ ధనాధన్ దేశవాళీ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన షమి 27.3 ఓవర్లు బౌలింగ్ చేసి 8 వికెట్లు తీశాడు. అయితే షమి రాకను స్వాగతిస్తామని, కానీ అతను ఫిట్‌గా ఉన్నాడని వంద శాతం కంటే ఎక్కువగా నమ్మినప్పుడే జట్టులోకి తీసుకుంటామని రోహిత్ అన్నాడు. ఇటీవల షమికి మోకాలికి వాపు రావడంతో తిరిగి ఆలోచనలో పడ్డామని తెలిపాడు.
''షమి కోసం భారత జట్టు తలుపులు తెరిచే ఉన్నాయి. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నప్పుడు షమి మోకాలికి వాపు రావడంతో, అతన్ని పర్యవేక్షిస్తున్నాం. ఇది అతన్ని టెస్టు మ్యాచ్ సన్నద్ధతకు అడ్డుకుంటుంది. అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం. అతన్ని ఆస్ట్రేలియాకు తీసుకువచ్చి, ఇబ్బందుల్లోకి నెట్టకూడదని భావిస్తున్నాం. ఫిట్‌గా ఉన్నాడని 100 శాతం కంటే ఎక్కువ నమ్మకం ఉంటేనే తీసుకురావాలని చూస్తున్నాం''

''ఎందుకంటే షమి ఆటకు దూరమై చాలా కాలం అయ్యింది. ఇక్కడకి తీసుకువచ్చి జట్టు కోసం తీవ్రంగా శ్రమించమని అతన్ని ఒత్తిడికి గురిచేయలేం. కొందరు నిపుణులు షమిని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ల నివేదికను బట్టి మేం అంతిమంగా ఓ నిర్ణయానికి వస్తాం. ప్రతి మ్యాచ్‌లో షమిని వాళ్లు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత అతని శరీరం ఎలా సహకరిస్తుంది? 20 ఓవర్లు మైదానంలో గడిపిన తర్వాత ఎలా ఉన్నాడని? చూస్తున్నారు. అయితే అతను ఎప్పుడైనా తిరిగొచ్చి టీమిండియాకు ఆడే అవకాశం ఉంది'' అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.