టీ20 వరల్డ్ కప్ విజయోత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచకప్ గెలిచి వారం రోజులు దాటినా ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ముంబైలోని విక్టరీ పరేడ్ ముగిసిన అనంతరం తమ సొంతగూటికి చేరుకున్న ఆటగాళ్లకు గ్రాండ్ వెల్‌కమ్ దక్కుతోంది. అభిమానులు స్థానికంగా విశ్వవిజేతలకు బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన మహ్మద్ సిరాజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది.
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం భారత జట్టులో ఉన్న తమ రాష్ట్ర ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, యశస్వీ జైస్వాల్ విధాన్ భవన్‌కు ఆహ్వానించారు. ఈ వరల్డ్ ఛాంపియన్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సన్మానించారు. అనంతరం విధాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరాఠీలో మాట్లాడాడు. ఆహ్వానించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు ధన్యవాదాలు చెప్పాడు.

అనంతరం టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సూర్యకుమార్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌ను రోహిత్ కొనియాడాడు. అయితే ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే సూర్యను జట్టు నుంచి తప్పించేవాడినని సరదాగా పేర్కొన్నాడు. ''బంతి సేఫ్‌గానే తన చేతుల్లోకి వచ్చిందని క్యాచ్ అనంతరం సూర్య చెప్పాడు. అలా జరగడం బాగుంది. లేదంటే సూర్య సంగతి చెప్పేవాడిని. జట్టు నుంచి తప్పించేవాడిని'' అని రోహిత్ నవ్వుతూ చెప్పాడు. దీంతో అక్కడ ఉన్న అందరూ నవ్వారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మొదట భారత్ ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. అయితే సూర్య అందుకున్న అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా.. హార్దిక్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు.
దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్‌ను అడ్డుకొన్న సూర్య, తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరేసాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.