

హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక సిక్స్ కొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 350 సిక్సర్లు కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున మహేంద్రసింగ్ ధోనీ 353 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్‌గేల్ 517 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (476 సిక్సర్లు), బ్రెండన్ మెక్‌కలమ్ (398), ధోని (353), శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య (352), రోహిత్ శర్మ (350)లు ఉన్నారు.
ఇదిలా ఉంటే, మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 281 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, కమిన్స్, రిచర్డ్‌సన్ తలో మూడు వికెట్లు తీసుకోగా... నాథన్ లియాన్‌కు ఒక వికెట్ లభించింది.

ఈ విజయంతో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మార్చి 10న మొహాలీ వేదికగా జరగనుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్(1) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(14) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(2)ని కమిన్స్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత ధోని(26) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్‌తో కలిసి 88 పరుగుల్ని కోహ్లీ జోడించాడు.
ఆ తర్వాత జట్టు స్కోరు 174 పరుగుల వద్ద జాదవ్ ఔట్ కాగా, విజయ్ శంకర్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడుతున్న కోహ్లీ(123) ఆడమ్ జంపా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
చివర్లో కేదార్ జాదవ్ (26) విజయ్ శంకర్ (32), రవీంద్ర జడేజా (24) మెరుపులు మెరిపించినప్పటికీ ఆసీస్ బౌలర్లకు తలవంచక తప్పలేదు. మరో పది బంతులు మిగిలి ఉండగానే 281 పరుగులకు భారత్ ఆలౌటైంది. అంతకముందు ఓపెనర్లు ఆరోన్ ఫించ్(93), ఉస్మాన్ ఖవాజా(104) సెంచరీతో చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.