
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుతం క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తుంటే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ సందీప్ పాటిల్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మ మెరుగ్గా ఉన్నాడని అన్నాడు. పెళ్లి దృష్ట్యా విరాట్ కోహ్లీ శ్రీలంక సిరిస్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలను స్వీకరించాడు. వన్డే సిరిస్‌ను 2-1తో, మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు మొహాలి వేదికగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీని సాధించాడు. తద్వారా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక, టీ20 సిరిస్ విషయానికి వస్తే ఇండోర్ వేదికగా జరిగిన టీ20లో 35 బంతుల్లో సెంచరీని నమోదు చేసి ప్రపంచ రికార్డుని సమం చేశాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన దక్షిణాఫ్రికా అటగాడు డేవిడ్ మిల్లర్ రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఏబీపీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సందీప్ పాటిల్... రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.
'విరాట్ కోహ్లీ కచ్చితంగా గొప్ప బ్యాట్స్‌మనే. సందేహం ఏమీ లేదు. అతను భారత్ తరఫున టెస్టుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కోహ్లీ కంటే రోహిత్ శర్మ మెరుగ్గా ఉన్నాడు' అని చెప్పాడు. ఈ ఏడాది వన్డేల్లో అద్భుతమై రికార్డుని కలిగి ఉన్నాడు.
2017లో 21 వన్డేలాడిన రోహిత్ శర్మ 71.83 యావరేజితో 1293 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ ఏడాది రోహిత్ శర్మ మొత్తం 65 సిక్సులతో ఈ జాబితాలో అగ్రస్ధానంలో నిలిచాడు. అంతకముందు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ (63) పేరిట ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మ ఆ రికార్డుని అధిగమించాడు.
'విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ తిరిగొచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాలో పరుగుల వరద పారిస్తాడన్న నమ్మకం నాకుంది. ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ శ్రీలంకపై ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడని మీరు ప్రశ్నించవచ్చు. కోహ్లీ కూడా వారిమీదేగా ఆడింది. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా ది బెస్ట్ అని రోహిత్ నిరూపించుకున్నాడు' అని పాటిల్ అన్నాడు.
కోహ్లీ ఈ ఏడాది 10 టీ20లు ఆడగా 37.37 యావరేజితో 283 పరుగులు చేశాడు. అయితే 9 టీ20లాడిన రోహిత్ 31.44 సగటుతో 283 పరుగులు చేశాడు. ఈ ఏడాది 26 వన్డేలాడిన విరాట్ కోహ్లీ 76.84 యావరేజితో 1,460 పరుగులు చేయగా 21 మ్యాచ్‌లాడిన రోహిత్ 71.83 సగటుతో 1,293 పరుగులు చేశారు. వీరిద్దరూ ఈ ఏడాది ఆరు సెంచరీలు నమోదు చేశారు.