ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఆ సుదీర్ఘ సిరీస్‌లోని తన అనుభవాలు పంచుకున్నాడు. స్వదేశంలో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సీనియర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి లేకపోయినప్పటికీ కుర్రాళ్లతో కలిసి ఇంగ్లిష్ జట్టును ఓడించాడు. తొలి టెస్టులో పరాజయం అనంతరం గొప్పగా పుంజుకుని తర్వాత మ్యాచ్‌ల్లో వరుసగా జట్టును గెలిపించాడు.
అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్ చేసిన కొన్ని పనులు వైరల్ అయ్యాయి. సహచర ఆటగాళ్లను రోహిత్ తిట్టడం, కొన్నిసార్లు అసభ్య పదజాలం వాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇవన్నీ స్టంప్ మైక్‌లో రికార్డు అవ్వడంతో వెలుగులోకి వచ్చాయి. దీని గురించి హిట్‌మ్యాన్ మాట్లాడాడు. ఎవరినీ బాధ పెట్టాలని అలా చేయలేదని, జట్టు గురించి ఆలోచించి అలా అన్నానని రోహిత్ వివరించాడు.

''మైదానంలో యువ ఆటగాళ్లతో ఆడటాన్ని ఆస్వాదిస్తాను. నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు మైక్‌లో వినిపించి ఉంటాయి. అవి ఎవరినీ బాధపెట్టాలని కాదు. వాళ్లు వాళ్ల బాధ్యతలు నిర్వర్తించాలి, జట్టు గురించి ఆలోచించాలని అంటాను. అయితే అందరూ ఆటలో తీవ్రతతో భాగస్వామ్యమవ్వడం సంతోషంగా ఉంది. వాళ్లతో కలిసి ఆడటం ఎంతో నచ్చింది. భవిష్యత్‌లో మరింత క్రికెట్ ఆడతామని భావిస్తున్నా''
''అయిదు టెస్టుల సిరీస్ ఎప్పుడూ కఠినమైనదే. నెలన్నర పాటు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ వంటి ప్రత్యర్థితో సిరీస్ అంటే భిన్నమైన అనుభూతి ఉంటుంది. సిరీస్ అంత ఈజీగా సాగదు అని తెలుసు. మా ఉత్తమ ఆటతో అంతిమంగా మంచి ముగింపు పొందాలి. నాలుగు విజయాలు సాధించినందుకు సంతోషంగా ఉంది''
''కెప్టెన్‌గా ఈ సిరీస్ నన్ను ఎంతో ఆలోచించేలా చేసింది. ఏం చేయాలి? వాళ్లను ఎలా ఆపాలి? ప్రత్యర్థిపై ఒత్తిడి ఎలా తీసుకురావాలి? ఇలా తెరవెనుక ఎంతో పని జరిగింది. అదృష్టవశాత్తు నా చుట్టూ గొప్ప సహాయక బృందం ఉంది. నాకు గైడ్ చేస్తూ సాయం చేశారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర చాలా కీలకం. ఇక మా కుర్రాళ్లతో ఆడటాన్ని ఆస్వాదిస్తా. వాళ్లు గడుసు పోరళ్లు. వాళ్లల్లో చాలా మంది గురించి నాకు బాగా తెలుసు. వాళ్ల బలాలు, ఎలా ఆడతారనే దానిపై స్పష్టత ఉంది''
''ఇక యువ ప్లేయర్ల అరంగేట్ర సమయంలో అక్కడ వాళ్ల తల్లిదండ్రులు ఉన్నారు. అవి ఎంతో భావోద్వేగ క్షణాలు. కంగా లీగ్‌లో నేను సర్ఫరాజ్ తండ్రితో కలిసి ఆడాను. ఆయన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. దూకుడుగా ఆడతాడు. ముంబై క్రికెట్ సర్కిల్‌లో ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రయత్నం, కృషితో సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి వచ్చాడు. సర్ఫరాజ్ టెస్టు క్యాప్ ఆయనకు కూడా చెందుతుంది'' అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్‌లో సిద్ధమవుతున్నాడు.