వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి పొట్టి కప్ అందుకోవాలని బీసీసీఐ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అయితే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీ ప్లాన్ లో ఉన్నారా లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐని క్లారిటీ కోరాడని తెలిసింది. టీ20 ప్రపంచకప్ వ్యూహాలు ఏంటో చెప్పాలని, దాని బట్టి సన్నద్ధమవుతానని మీటింగ్ లో రోహిత్ అడిగాడని బీసీసీఐ ఓ అధికారి తెలిపారు.
వన్డే వరల్డ్ కప్ లో ఆద్యంతం గొప్పగా రాణించిన టీమిండియా ఫైనల్ లో తడబడి కప్ ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఓటమిపై బీసీసీఐ ఇటీవల సమీక్ష నిర్వహించింది. ఈ మీటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్ సెల్లర్ హాజరయ్యారు.

ఈ సమావేశం లో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు కెప్టెన్సీ ఎవరు వహిస్తారని ప్రధానంగా చర్చ సాగింది. దానిపై రోహిత్ మాట్లాడుతూ.. కెప్టెన్ తానో కాదో క్లారిటీ ఇస్తే దాని బట్టి సన్నద్ధమవుతానని అన్నాడు. అనంతరం టీ20 ప్రపంచకప్ నకు కూడా హిట్ మ్యానే కెప్టెన్ అని సమావేశంలో నిర్ణయించారు. కోచ్ ద్రవిడ్ తో పాటు బీసీసీఐ పెద్దలు కూడా కెప్టెన్ గా రోహిత్ సరైన వ్యక్తి అని ఏకాభిప్రాయానికి వచ్చారు.
అయితే దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ కు కూడా కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉండమని తొలుత బీసీసీఐ కోరిందని ఓ అధికారి వెల్లడించారు. కానీ రోహిత్ విశ్రాంతి కోరడంతో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా ఎంపిక చేశారని వివరించారు. డిసెంబర్ 10న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.