
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ 150 ఏళ్ల సంబరం అంబరాన్ని అంటే విధంగా ఫైర్ బ్రాండ్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ శర్మ పరుగుల వరద పారించారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అతనిపై కాసుల వర్షం కురిపించింది. కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో శ్రీలంకపై 264 పరుగులు సాధించిన రోహిత్‌కు పరుగుకో వెయ్యి రూపాయల చొప్పున రూ. 2.64 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈడెన్‌లో రోహిత్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో క్యాబ్ ఆనందం పట్టలేకపోయింది.
తన ఇన్నింగ్సుపై రోహిత్ శర్మ ఇలా అన్నాడు...
ఈడెన్‌లో 50 ఓవర్లూ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి 10-15 ఓవర్లు బ్యాటింగ్ కష్టమైంది. అయితే క్రీజులో కుదురుకునేందుకు రహానె సహకరించాడు. ఏదేమైనా అజేయంగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఈడెన్‌లో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఫస్ట్‌క్లాస్, టెస్ట్ అరంగేట్రం, ఐపీఎల్ శతకం ఇక్కడే చేశా. ఇది స్పెషల్ ఇన్నింగ్స్. భవిష్యత్‌లో ట్రిపుల్ సెంచరీ కోసం ప్రయత్నిస్తా. ఈ మ్యాచ్‌లో నా తప్పిదంతోనే కోహ్లీ అవుటయ్యాడు. అప్పుడప్పుడూ ఇలాంటి పొరపాట్లు సహజమే. అందుకే ఆటపై దృష్టిపెట్టా. ఇక కెరీర్‌లో ఒకటి, రెండు వైఫల్యాలు నన్ను ఆపలేవు. కఠోర శ్రమే నన్ను ముందుకు నడిపిస్తుంది. - రోహిత్ శర్మ
మూడు లైఫ్‌లు
72 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ మరో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. తర్వాత 51 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మకు (4, 201, 222) మొత్తం మూడు లైఫ్‌లు లభించాయి. తొలుత ఐదో ఓవర్‌లో సులువైన క్యాచ్‌ను పెరీరా వదిలేశాడు. దీనికి లంక భారీ మూల్యమే చెల్లించుకుంది.
అజింక్యా రహానె (28), అంబటి రాయుడు (8) అవుటైన తర్వాత రోహిత్‌తో కెప్టెన్ కోహ్లీ జతకట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 202 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 32వ ఓవర్‌లో సింగిల్‌తో కెరీర్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. శతకం తర్వాత సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కోహ్లీ అవుటైనా ఊతప్పతో ఐదో వికెట్‌కు 128 రన్స్ జోడించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ, అత్యధిక స్కోరు సాధించాడు.