
హైదరాబాద్: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

మొత్తంగా చూస్తే వన్డేల్లో రోహిత్ శర్మకు 16వ సెంచరీ కావడం గమనార్హం. భారత్ తరుపున వన్డేల్లో అత్యంత వేగంగా 16 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్ధానంలో నిలిచాడు. 16 సెంచరీలు చేసేందుకు రోహిత్ శర్మకు 167 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, విరాట్ కోహ్లీ 110 ఇన్నింగ్స్‌లతో అగ్రస్ధానంలో నిలిచాడు.
సౌరవ్ గంగూలీ (151), సచిన్ టెండూల్కర్ (185) ఇన్నింగ్స్‌లతో రెండు, నాలుగు స్ధానాల్లో నిలిచారు. దీంతో పాటు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా కూడా రోహిత్ మరో రికార్డు సృష్టించాడు. గతంలో 40 సిక్సులతో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును 41 సిక్సులతో రోహిత్ అధిగమించాడు.
దీంతో పాటు రోహిత్ శర్మ వన్డేల్లో ఒక ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో కూడా చేరాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉండగా... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 6 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.
వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరంచిన రోహిత్ తన రెండో వన్డేలోనే సెంచరీని నమోదు చేసి మరో రికార్డును సాధించాడు. సచిన్ కెప్టెన్‌గా బాధ్యత స్వీకరించి తొలి వన్డేలోనే సెంచరీ నమోదు చేయగా.. కోహ్లీ, రోహిత్, గంభీర్‌లు రెండో వన్డేలో సెంచరీ నమోదు చేశారు.
ఒక ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
* సచిన్ టెండూల్కర్ - 1998లో 9 సెంచరీలు, 1996లో 6 సెంచరీలు
* సౌరవ్ గంగూలీ - 2000లో 7 సెంచరీలు
* రాహుల్ ద్రవిడ్ - 1999లో 6 సెంచరీలు
* విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ - 2017లో 6 సెంచరీలు