భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాపై పెర్త్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్న నితీష్ కుమార్ రెడ్డిపై రోహిత్ వ్యక్తం చేసిన ప్రశంసలు, ప్రోత్సాహం ఇప్పుడు అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.
యువ ఆల్‌రౌండర్‌కు క్యాప్ నంబర్ 260
ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి భారత వన్డే క్రికెట్‌లో 260వ క్యాప్ లభించింది. ఈ డెబ్యూ సమయంలో నితీష్‌ను ఉద్దేశించి మాట్లాడిన రోహిత్ శర్మ.. 22 ఏళ్ల ఈ ఆటగాడిలో ఉన్న నిబద్ధత, ఆటతీరు పట్ల తనకున్న సానుకూల అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రోహిత్ మాటల్లోని పూర్తి విశ్వాసం కనిపించింది.

"క్యాప్ నంబర్ 260, నితీష్ రెడ్డి, ఈ క్లబ్‌లోకి మీకు ఘనస్వాగతం. మీ కెరీర్ చాలా అద్భుతంగా ప్రారంభమైంది. మీలో ఉన్న ఈ గొప్ప వైఖరి కారణంగా, మీరు భారత జట్టులో చాలా ముందుకు సాగుతారని నాకు నూటపది శాతం నమ్మకం ఉంది. మీరు కేవలం వన్డేల్లోనే కాకుండా, అన్ని ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టీ20) ఒక గొప్ప ఆటగాడిగా ఎదుగుతారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరు ప్రతిచోటా ఉండాలని కోరుకుంటున్నారు. మీ కోరిక మేరకు మీరు అక్కడే ఉండేలా, మీ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి.. మేము, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము." అని రోహిత్ శర్మ అన్నాడు. ఓ యువ ఆటగాడి అరంగేట్రం సమయంలో రోహిత్ శర్మ నుంచి ఇంతటి దృఢమైన ప్రోత్సాహం లభించడం, నితీష్ రెడ్డికి గొప్ప మానసిక బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
తొలి వన్డేలో నితీష్ మెరుపులు
తొలి వన్డేలో టీమిండియా టాపార్డర్ విఫలమైనప్పటికీ, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన చిన్న ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నితీష్ 11 బంతులు ఎదుర్కొని, నాటౌట్‌గా 19 పరుగులు చేశాడు. ఈ స్కోరులో రెండు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. చివరి ఓవర్లలో భారత్‌కు ఈ పరుగులు చాలా కీలకం అయ్యాయి. బౌలింగ్‌లో 2.1 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు, వికెట్ పడకపోయినా అతనిలోని ఆల్‌రౌండ్ నైపుణ్యంపై టీమ్‌కు నమ్మకం పెరిగింది.
తొలి వన్డే ఫలితం
వర్షం అంతరాయం కలిగించిన పెర్త్ మ్యాచ్‌లో భారత్ 26 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37) రాణించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తదుపరి మ్యాచ్‌లు అక్టోబర్ 23, 25 తేదీల్లో జరగనున్నాయి.