ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ కొత్త ఆశలను చిగురింపజేసింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర రీతిలో రీ-ఎంట్రీ ఇచ్చాడు. కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు బాది ముంబై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ షాట్లు అయిన ఫుల్, కవర్ డ్రైవ్స్, లాంగ్-ఆన్‌పై భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో ముంబై 229 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
రోహిత్ శర్మ ప్రదర్శనపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. జియో స్టార్‌తో మాట్లాడిన సునీల్ గవాస్కర్ రోహిత్ ఫామ్‌పై కీలక కామెంట్లు చేస్తూ మిగిలిన జట్లను అప్రమత్తం చేశారు. "ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడిన విధానం అద్భుతం. హిట్ మ్యాన్ తన సహజసిద్ధమైన ఫామ్‌ను అందిపుచ్చుకున్నారు. రోహిత్ ఇదే జోరును కొనసాగిస్తే ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్ రేసులో నిలవడమే కాకుండా, పాయింట్ల పట్టికలో ఇతర జట్ల లెక్కలను తలకిందులు చేయడం ఖాయం" అని సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పారు. ముంబైకి రోహిత్ ఫామ్ ఓ పెద్ద ప్లస్ పాయింట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఇప్పటివరకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబైకి ప్లే-ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ముంబై ప్లే-ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలి ఉన్న 4 మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ ఇలాగే ఆడితే, ముంబై 14 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. 14 పాయింట్లతో ప్లే-ఆఫ్ చేరడం కష్టమైనప్పటికీ.. ఇతర జట్ల గెలుపోటములను ప్రభావితం చేస్తూ ముంబై ఓ 'కింగ్ మేకర్' పాత్రను పోషించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.