పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. కాగా, ఓటమి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
మహ్మద్ షమి పునరాగానమని గురించి రోహిత్ అప్‌డేట్ ఇచ్చాడు. అతని కోసం టీమిండియా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పాడు. అయితే షమి పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి 100 శాతం కంటే ఎక్కువగా నమ్మినప్పుడే ఆస్ట్రేలియాకు తీసుకువస్తామని చెప్పాడు. జస్‌ప్రీత్ బుమ్రా పనిభారం గురించి హిట్ మ్యాన్ మాట్లాడాడు. బుమ్రాతో పాటు ఇతర బౌలర్లు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించాలని అన్నాడు. రెండో టెస్టులో వికెట్ సాధించని హర్షిత్ రాణాకు మద్దతు ఇచ్చాడు. మరో అవకాశం ఇవ్వాలని పరోక్షంగా పేర్కొన్నాడు.

అయితే మీడియా సమావేశంలో రోహిత్‌కు.. క్లోజ్‌డ్ డోర్స్‌లోనే టీమిండియా ప్రాక్టీస్ చేయాలని ఎందుకు నిర్ణయించుకుందనే ప్రశ్న ఎదురైంది. దానికి రోహిత్ స్పష్టంగా వివరణ ఇచ్చాడు. భారత జట్టు ప్రాక్టీస్‌కు అభిమానులను అనుమతించకూడదని బీసీసీఐ అడిలైడ్ టెస్టు ప్రారంభానికి కొన్ని రోజుల ముంగిట నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన అంత వరకు క్లోజ్‌డ్ డోర్స్‌లోనే టీమిండియా సాధన చేయనుంది.
''నెట్స్ సెషన్స్ ప్రైవేటు విషయాలు. కానీ సాధనను చూడటానికి ఎంతో మంది ప్రజలు వస్తున్నారు. సాధన చేసే క్రమంలో సంభాషణలు కొన్ని జరుగుతుంటాయి. అవి వ్యక్తిగతమైనవి. సింపుల్‌గా చెప్పాలంటే.. అవి జట్టు ప్రణాళికలు-వ్యూహాలు. ఎన్నో విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ప్రజలు దగ్గరగా వచ్చి ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది'' అని రోహిత్ శర్మ అన్నాడు. అందుకే క్లోజ‌్‌డ్ ప్రాక్టీస్ సెషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించాడు. టెస్టులు ఆడే సమయంలో వచ్చి ఆటగాళ్లను ప్రజలు చూడొచ్చని సరదాగా రోహిత్ వ్యాఖ్యానించాడు. కాగా, గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.