అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్లు సత్తాచాటలేకపోయారు. బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాకు తోడుగా సిరాజ్ ఫర్వాలేదనిపించాడు.
స్పిన్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. ఇక యువ పేసర్ హర్షిత్ రాణా నిరాశపరిచాడు. ఒక్క వికెట్ సాధించలేకపోయాడు. అంతేగాక రెండు సార్లు డకౌటయ్యాడు. కాగా, బంతితో పాటు కీలక పరుగుల చేసే సామర్థ్యంతో తుదిజట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా విఫలమవ్వడంపై మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడాడు. తొలి టెస్టులో రాణా సత్తాచాటాడని, రెండో టెస్టులో నాణ్యమైన బ్యాటర్ ట్రావిస్ హెడ్ కారణంగానే ఒత్తిడికి గురయ్యాడని యువ పేసర్‌కు హిట్ మ్యాన్ మద్దతు ఇచ్చాడు.

''తొలి టెస్టులో రాణా ఎలాంటి తప్పు చేయలేదు. బాగా ఆడాడు. జట్టుకు అవసరమైన స్థితిలో సత్తాచాటాడు. ఓ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి మరో మ్యాచ్‌లో పక్కనపెట్టడం ప్లేయర్‌కే కాదు, జట్టుకు మంచిది కాదు. ఒక్క మ్యాచ్‌తోనే ఆటగాడిపై అంచనాకు రావడం సరైనది కాదు. అయితే తుదిజట్టులో కొన్నిసార్లు మార్పులు ఉంటాయి. విజయం కోసం మార్పులు చేయాల్సి ఉంటుంది. కానీ అతను ఎలాంటి పొరపాటు చేయకండా తప్పించడంలో అర్థం ఉండదు''
''ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణా 4 వికెట్లు తీశాడు. అతను మంచి లయలోనే బౌలింగ్ చేశాడు. అయితే కొన్నిసార్లు మంచి ప్రదర్శన రాబట్టవచ్చు. మరికొన్నిసార్లు జట్టు కోరుకునే ప్రదర్శన రాకపోవచ్చు. అయితే అతను మంచి బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఎదుర్కొన్నాడు. రాణాపై హెడ్ ఒత్తిడి తీసుకువచ్చాడు. రాణాకు మద్దతు ఇవ్వాలి'' అని రోహిత్ పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టులో రాణా 16 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 5.40 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు.