Rohit Sharma: టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా లేదా అనే అంశంపై నెలకొన్న సందిగ్ధతకు దాదాపు తెరపడింది. తాను ఆ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించారు. మార్చి నెల తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ద్వారా పెర్త్‌లో బరిలోకి దిగనున్నాడు. రోహిత్ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని రోహిత్ కోరిక
రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ లో ఆడతాడా అనే దానిపై గత కొంతకాలంగా అనేక ప్రశ్నలు, సస్పెన్స్‌లు నెలకొన్నాయి. ఇంకా రెండేళ్లు సమయం ఉండటంతో అప్పటికీ రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటారా? ఫామ్‌ను కొనసాగించగలుగుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి ఆయన స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రోహిత్ వన్డేల్లో కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నారు. అయితే తాజాగా ఓ వీడియో ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అంతరంగాన్ని బయటపెట్టారు.

మేక్-ఎ-విష్ కార్యక్రమంలో రోహిత్ కీలక ప్రకటన
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. 'మేక్-ఎ-విష్' కార్యక్రమం ద్వారా ఓ చిన్న పిల్లాడితో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపించింది.పిల్లాడు రోహిత్‌ను "తరువాత వన్డే ప్రపంచకప్ ఎప్పుడు?" అని అడిగాడు. రోహిత్ సమాధానమిస్తూ "2027లో" అని చెప్పారు.ఆ తర్వాత ఆ చిన్నారి "మీరు ఆ ప్రపంచకప్ ఆడతారా?" అని అడిగాడు. దీనికి బదులుగా రోహిత్ శర్మ చిరునవ్వుతో "అవును, నేను ఆడాలనుకుంటున్నాను" అని బదులిచ్చారు. ఈ వీడియో రోహిత్ శర్మ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది.
ఆస్ట్రేలియా సిరీస్ కీలకం
ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ రోహిత్ శర్మ కెరీర్‌కు చాలా కీలకం కానుంది. 2027 ప్రపంచకప్ ఆడాలనే తన కలను నెరవేర్చుకోవాలంటే.. ఈ సిరీస్ నుంచే రోహిత్ నిలకడగా రాణిస్తూ తన ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. తనపై విమర్శలు చేసేవారికి, సెలెక్టర్లకు తాను ఇంకా జట్టులో కొనసాగడానికి అర్హుడిని అని ఈ సిరీస్‌లో పరుగులు చేయడం ద్వారా నిరూపించుకోవాలి. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించారు. భారత్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరుకున్నా, తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.