
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ట్రైనింగ్‌లో పడ్డాడు. ఈ లెక్కన శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అతను ఫిట్‌గా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడే సమయంలో రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా రోహిత్ బొటన వేలికి గాయమైంది. దీంతో మైదానం వీడిన అతను ఢాకాలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.
ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉండటంతో చివర్లో బ్యాటింగ్ చేశాడు రోహిత్. దీంతో అతని గాయం మరింత తీవ్రంగా మారింది. ఈ క్రమంలోనే మూడో వన్డేలో అతన్ని టీం మేనేజ్‌మెంట్ ఆడించలేదు. వెంటనే రోహిత్‌ను ముంబై పంపించేసింది. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందించారు. ఆ తర్వాత బంగ్లా టెస్టు సిరీస్‌కు అతను తిరిగి జట్టులో కలుస్తాడని అనుకున్నారు. కానీ గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదని, టెస్టు సిరీస్‌లో ఆడితే అది మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉందని భావించిన బీసీసీఐ.. ఆ సిరీస్ నుంచి రోహిత్‌ను తప్పించింది.

జనవరి 3 నుంచి శ్రీలంకతో భారత జట్టు మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత మూడు వన్డేలు కూడా ఆడుతుంది. ఇప్పటి వరకు టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ సిరీస్ బ్రాడ్‌కాస్ట్ చేసే టీవీ ఛానెల్ కూడా.. శ్రీలంకను హార్దిక్ పాండ్యా ఎదుర్కొంటాడని ప్రోమో విడుదల చేసింది.
ఈ సిరీస్ కోసం రెండు బృందాలను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. తను ప్రాక్టీస్‌లోకి దిగినట్లు రోహిత్ వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలు షేర్ చేశాడు. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.