
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథిగా అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 3 లేదా అంతకంటే ఎక్కువ సిరీస్‌లలో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. 2017లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు రోహిత్ నాయకత్వం వహించాడు. అయితే ఆ సిరీస్‌ను భారత జట్టు 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత కోహ్లీ గైర్హాజరీలో 2018లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. అతని సారథ్యంలోనే 2021 చివర్లో న్యూజిలాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకున్న భారత జట్టు.. తాజాగా విండీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసింది.
దీంతో రోహిత్ ఖాతాలో 3 లేదా అంతకంటే ఎక్కువ టీ20 సిరీస్‌లను వైట్‌వాష్ చేసిన రికార్డు చేరింది. ఈ రికార్డులో రోహిత్ శర్మ కంటే ముందు పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, అఫ్గనిస్తాన్ కెప్టెన్ అస్గర్ అఫ్గర్ ఉన్నారు. సర్ఫరాజ్ అహ్మద్ ఖాతాలో 5 టీ20 సిరీస్‌ల క్లీన్‌స్వీప్ రికార్డు ఉండగా.. అస్గర్ అఫ్గర్ ఖాతాలో 4 టీ20 సిరీస్‌ల వైట్‌వాష్ రికార్డు ఉంది.
కాగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లోనే 65 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా వెంకటేశ్ అయ్యర్ (35), ఇషాన్ కిషన్ (34) రాణించారు. 185 పరుగులతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, దీపక్ చహర్ 2, వెంకటేశ్ అయ్యర్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లతో రాణించారు. ఇక సిరీస్‌లో అదరగొట్టిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.