భారత జట్టు వన్డే ఫార్మట్ కేప్టెన్ రోహిత్ శర్మకు ఎర్త్ పడేలాగే కనిపిస్తోంది. అతని స్థానంలో వన్డే ఫార్మట్ కు కూడా కొత్త కేప్టెన్ ను సెలెక్ట్ చేయాలనే అభిప్రాయాలు ఊపందుకుంటోన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. అండర్సన్- టెండుల్కర్ సిరీస్ లో టెస్ట్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ సత్తా చాటడమే.
ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మట్లకూ ముగ్గురు కేప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్, టెస్టులకు గిల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యాన్ని వహిస్తోన్నారు. వన్డే మినహా మిగిలిన ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు రోహిత్. అతని స్థానంలో గిల్ కు జట్టు పగ్గాలు అందించాలనే డిమాండ్ తలెత్తుతోంది.

రోహిత్ శర్మ ఉద్దేశం వేరేలా ఉంటోంది. 2027 వరల్డ్ కప్ కు వరకు వన్డే ఫార్మట్ లో కేప్టెన్ గా కొనసాగాలని కోరుకుంటోన్నాడు. ఆ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ తో పాటే కేరీర్ ను సంపూర్ణంగా ముగించాలని భావిస్తోన్నాడు. అతనితో పాటు విరాట్ కోహ్లీ కూడా అదే అభిప్రాయంలో ఉన్నాడు.
వన్డే ఫార్మట్ నుంచి కూడా తప్పుకోవాలనే ఆలోచన విరాట్ కోహ్లీలో కూడా అస్సలు లేదు. ఇప్పటికే టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్స్ కు గుడ్ బై చెప్పారిద్దరూ. ఈ నేపథ్యంలో- ఈ రెండు ఫార్మట్ ల నుంచి తప్పుకోవడం, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ లు పరిమితంగా ఉంటోండటం వల్ల కుటుంబంతో గడపడానికి, విశ్రాంతి తీసుకోవడానికీ తగినంత సమయం ఉంటుందనేది వారి వాదన.
2026 చివరి వరకు భారత్.. 27 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడనుంది. అటు ఫిట్ నెస్ పరంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు రోహిత్ శర్మకు గానీ, విరాట్ కోహ్లీకి గానీ. సుదీర్ఘ కేరీర్ లో వీరిద్దరూ గాయాలబారిన పడిన సందర్భాలు తక్కువే. ఫామ్ ను కోల్పోయిన లేదా, బ్రేక్ తీసుకున్న సందర్భాలు కూడా పెద్దగా లేవు. ఆడిన ప్రతి మ్యాచ్ లో పూర్తి కమిట్మెంట్ చూపారనడంలో సందేహాలు అక్కర్లేదు.
దీనితో ఐసీసీ వరల్డ్ కప్ 2027 వరకూ వన్డేల్లో కొనసాగాలని కోరుకంటోన్నారు. దీనికి బీసీసీఐ కొన్ని కండిషన్లు పెట్టినట్లు చెబుతున్నారు. వరల్డ్ కప్ లో ఉండదలచుకుంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాల్సి ఉంటుందనే మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
విజయ్ హజారే 2025/2026 మలి విడత సైకిల్ ఈ ఏడాది డిసెంబర్ లో ఆరంభమౌతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల జట్లూ ఇందులో మ్యాచ్ లు ఆడతాయి. రోహిత్, కోహ్లీ.. చాలాకాలంగా డొమెస్టిక్ క్రికెట్ కు దూరంగా ఉంటోన్నారు. ఇప్పుడు బీసీసీఐ కండీషన్స్ కు ఎలా స్పందిస్తారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.