మరో వారం రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ మహా సమరానికి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టికప్‌పై కన్నేసింది. ఎట్టిపరిస్థితుల్లో కప్‌ను సాధించి విశ్వవిజేతగా నిలవాలని టీమిండియా కసితో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని పరిస్థితులకు అలవాటు పడటానికి ఇవాళే భారత ఆటగాళ్లు పయనమవుతున్నారు.
అయితే ఎంపికైన ప్లేయర్లు అందరూ ఒకేసారి యూఎస్‌ఏకు వెళ్లట్లేదు. రెండు బ్యాచ్‌లుగా అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. తొలి బ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ తదితరులు ఇవాళ విమానం ఎక్కనున్నారు. అయిదుగురు ఆటగాళ్లు మినహా మిగిలిన అందరూ కలిసి ముంబై విమానశ్రయం నుంచి బయలుదేరనున్నారు.

రెండో బ్యాచ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్, యుజువేంద్ర చాహల్, సంజు శాంసన్, అవేవ్ ఖాన్, రింకూ సింగ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత బయలుదేరుతారు. ఈ అయిదుగురు కూడా టీమిండియాతో కలిసి శనివారమే వెళ్లాల్సి ఉంది. కానీ క్వాలిఫయిర్-2కు అర్హత సాధించిన జట్లలో ఈ ఆటగాళ్లు ఉండటంతో కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకుంటారు. అయితే హార్దిక్ పాండ్య ఏ బ్యాచ్‌తో కలిసి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లట్లేదు.
హార్దిక్ ఒంటరిగా అమెరికా వెళ్లనున్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న హార్దిక్ అక్కడ నుంచి నేరుగా యూఎస్‌ఏకు పయనమవుతాడు. కోచింగ్ స్టాఫ్ మొదటి బ్యాచ్‌తోనే వెళ్లనుంది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. కాగా, మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి పొట్టి ప్రపంచకప్‌లో 20 దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మొత్తం దేశాలను అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.
గ్రూప్-ఏ చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ ఉన్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. కాగా, గ్రూప్ స్టేజ్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8కు క్వాలిఫై అయిన టీమ్స్‌ను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్-1, గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. భారత్ సెమీస్‌కు చేరుకుంటే జూన్ 27న గయానా వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. బార్బడోస్ వేదికగా జూన్ 29న ఫైనల్ జరగనుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్