INDvsSL : రోహిత్, కోహ్లీ ఆ మైలురాయి చేరుకుంటారా?

తొలి వన్డేలో ఘనవిజయంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా.. కోల్‌కతా వేదికగా జరిగే రెండో వన్డేలో కూడా అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు.. ఈడెన్ గార్డెన్స్‌లో కూడా విజయం సాధించి సిరీస్ తమ కైవసం చేసుకోవాలని అనుకుంటోంది.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు మూడు కీలక రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం అయ్యారు. అవేంటంటే..

రోహిత్, కోహ్లీ భాగస్వామ్యం
టీమిండియాకు వన్డే ఫార్మాట్లో దొరికిన అద్భుతమైన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీళ్లిద్దరూ భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ఈ క్రమంలో ఎన్నో కీలక భాగస్వామ్యాలు కూడా నెలకొల్పారు. ఇప్పుడు శ్రీలంకతో జరిగే వన్డేలో కూడా వీళ్ల ప్రదర్శన టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన ఈ జోడీ.. కోల్‌కతాలో కనీసం 31 పరుగులు చేస్తే అరుదైన మైలురాయిని చేరుకుంటుంది. వీళ్లిద్దరూ ఇప్పటి వరకు 84 భాగస్వామ్యాలు ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 4969 పరుగులు చేశారు. ఇప్పుడు మరో 31 పరుగులు చేస్తే.. భారత్ తరఫున 5000 పరుగులు చేసిన మూడో భారత జోడీగా అరుదైన రికార్డు సృష్టిస్తారు.

టీమిండియా కీలక రికార్డు
శ్రీలంకతో ఇటీవలి కాలంలో ఆడిన వన్డే సిరీస్‌లు అన్నింటిలో భారత జట్టే పైచేయి సాధించింది. ఇప్పటి వరకు జరిగిన చివరి తొమ్మిది వన్డే సిరీసులను భారత జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కోల్‌కతా మ్యాచులో కూడా గెలిస్తే ఈ సంఖ్య పదికి చేరుకుంటుంది. శ్రీలంకపై వరుసగా ఇన్ని సిరీసులు ఎవరూ గెలవలేదు. అంతేకాదు, ఒక ప్రత్యర్థిపై వరుసగా అత్యధిక వన్డే సిరీసులు గెలిచిన రికార్డు కూడా భారత్ పేరిటే ఉండటం గమనార్హం. వెస్టిండీస్‌పై భారత జట్టు ఇప్పటి వరకు వరుసగా 12 వన్డే సిరీసులు నెగ్గింది. టెస్టులు ఆడే దేశాల్లో ఇదే రికార్డు. శ్రీలంకపై కూడా ఈ ఘనత సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

అడుగు దూరంలో కోహ్లీ..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరిగి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన అతను.. శ్రీలంకపై కూడా అద్భుతమైన శతకంతో రాణించాడు. ఈ క్రమంలో అతను కూడా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 257 వన్డే ఇన్నింగ్స్‌లలో 12584 పరుగులు చేసి ఉన్నాడు. దీంతో వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో ఉన్న మహేల జయవర్దనే 12650 పరుగులు చేశాడు. అంటే కోహ్లీ కనుక రెండో వన్డేలో 67 పరుగులు సాధిస్తే.. జయవర్దనేను దాటేసి అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications