ICC Rankings: భారత క్రికెట్ అభిమానులకు షాకిస్తూ ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో స్టార్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు కనిపించలేదు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని ఐసీసీ నిబంధనల ప్రకారం తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే?
ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరి పేర్లు టాప్-10లో లేవు. గత వారం ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 736 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు భారత ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ 704 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. టాప్-20లో ఉన్న మరో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ 638 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నాడు. ఆగస్టు 20న విడుదలైన ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే టాప్ 10లో ఉన్నారు.

అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఐపీఎల్ 2025 తర్వాత ఏ మ్యాచ్ ఆడలేదు. భారత జట్టు తరఫున వారి చివరి మ్యాచ్ మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కావడం గమనార్హం. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పదేళ్ల తర్వాత భారత్‌కు ఐసీసీ వన్డే ట్రోఫీని అందించారు. కోహ్లీ కూడా గ్రూప్ దశల్లో అద్భుతంగా రాణించారు.
ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయంటే?
ఐసీసీ ర్యాంకింగ్స్ నియమాల ప్రకారం.. ఒక ఆటగాడు నిర్ణీత కాలంలో (క్వాలిఫయింగ్ పీరియడ్) ఏ మ్యాచ్ ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. వన్డేలకు ఈ గడువు 9-12 నెలలు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చివరిగా మ్యాచ్ ఆడింది ఫిబ్రవరిలోనే కాబట్టి, ఈ తొలగింపు ఒక సాంకేతిక లోపం అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒక ఆటగాడు ఏదైనా ఫార్మాట్ నుంచి రిటైర్ అయితే లేదా అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికితే ర్యాంకింగ్స్ నుంచి శాశ్వతంగా తొలగిస్తారు. ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు, ఆయన పేరు టెస్ట్ ర్యాంకింగ్స్ నుంచి తొలగించారు, కానీ వన్డే ర్యాంకింగ్స్‌లో కొనసాగించారు. అదే విధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌కు, ఈ ఏడాది మేలో టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు, అందువల్ల వారు ఆ రెండు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో కనిపించడం లేదు.