అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
అదే జోరులో రెండో టెస్టులోనూ విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో సిద్ధమవుతోంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకుంటాయని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. వ్యక్తిగత, గాయాల కారణాలతో దూరమైన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తిరిగి రెండో టెస్టుకు అందుబాటులోకి రావడంతో ప్లేయింగ్ 11లో మార్పులు ఉండనున్నాయని తెలిపాడు.

రోహిత్ శర్మ, గిల్ రాకతో ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ తమ స్థానాలు కోల్పోతారని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే పెర్త్ టెస్టులో ఆడిన ఏకైక భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని తెలిపాడు. సుందర్ స్థానంలో రవీంద్ర జడేజా తుదిజట్టులోకి వస్తాడని అన్నాడు. ''రెండు మార్పులు అయితే కచ్చితంగా చోటు చేసుకుంటాయి. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ప్లేయింగ్ 11లో ఉంటారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్ ఛేంజ్ అవుతుంది. కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ ఓపెనర్‌గా వస్తాడు''
''దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ జట్టులో చోటు కోల్పోతారు. కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో జడేజా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. రోహిత్, గిల్ గైర్హాజరీలో..పెర్త్ టెస్టులో యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. వన్‌డౌన్‌లో పడిక్కల్ వచ్చాడు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 74 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 176 బంతుల్లో 5 బౌండరీలతో 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతేగాక రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌తో కలిసి 201 పరుగుల రికార్డు ద్విశతక భాగస్వామ్యాన్ని కేఎల్ రాహుల్ నమోదు చేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, దేవదత్ పడిక్కల్.